Nallamala Forest: ప్రకృతి ఒడిలో.. హాయ్‌.. హాయ్‌!

14 Feb, 2022 22:34 IST|Sakshi
గిరిజన గూడేల్లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేయనున్న కాటేజీలు

నల్లమల అభయారణ్యంలో జంగిల్‌ క్యాంప్స్‌

పగలంతా జంగిల్‌ సఫారీ.. రాత్రి బసకు ఏర్పాట్లు

అత్యాధునిక వసతులతో కాటేజీలు, వెదురు గుడిసెల నిర్మాణం.. పైలెట్‌ ప్రాజెక్టుగా తుమ్మలబైలు ఎంపిక

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను నేరుగా వీక్షించే అవకాశం

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలు వీక్షించేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సహజ త్వంతో కూడిన సుందర దృశ్యాలను తిలకించేందుకు వస్తున్న పర్యావరణ ప్రేమికులకు అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావ రణం నడుమ అడవిలో సఫారీ చేసి రాత్రి బసచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం నల్లమల అభయారణ్యంలో జంగిల్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టుగా తుమ్మ లబైలు ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అత్యాధునిక వసతులతో కాటేజీలు, వెదురు గుడిసెలు, టెంట్లను ఏర్పాటు చేయనుంది. ప్రకృతి సిరిసంపదలకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతంలోని గిరిజనగూడేల్లో సంస్కృతి, సంప్రదాయాలను నేరుగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించబోతోంది.

పెద్దదోర్నాల: దట్టమైన నల్లమల అభయారణ్యంలో శీతోష్ణస్థితి మండలంగా గుర్తింపు పొందిన తుమ్మలబైలు గిరిజన గూడేన్ని అటవీశాఖ అధికారులు పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. చెంచు గిరిజనులు నివసించే ప్రాంతంలోనే పర్యాటకులు బస చేసే అవకాశాన్ని కల్పించేందుకు చర్యలు చేప ట్టనున్నారు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక జీవితానికి అలవాటు పడిన పర్యావరణ ప్రేమి కులు.. చెంచు గిరిజనుల ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వారు నివసించే గృహాలు, వారి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.

దీంతో పాటు నల్లమలలోని ఆహ్లాదకరమైన వాతా వరణం, ఎత్తయిన పర్వతాలు, లోతైన లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలే కాక జల పాతాలు, సెలయేళ్లు, పచ్చని తివాచీ పరిచిన ట్లుండే అందమైన పచ్చికబయళ్లు, స్వేచ్ఛాయుత వాతావరణంలో సంచరించే పెద్దపులులు, చిరుతలు, జింకలు, దుప్పులు మరెన్నో వన్యప్రాణులు కనిపించనున్నాయి. మానవాళిని అబ్బురపరిచే అందమైన పుష్పజాతులు, పలు రకాల ఔషధ మొక్కలు, ఎన్నో వింతలు విశేషాలను తిలకించడంతో పాటు వాటి విశేషాలను తెలుసుకునే అధ్భుతమైన అవకాశాన్ని పర్యాటకులకు అటవీశాఖ కల్పించబోతోంది.

గూడెంలో నివసించే కొంత మంది చైతన్యవంతులైన యువకులను గుర్తించి వారి ద్వారా గూడెంలోని చెంచు గిరిజనులకు జంగిల్‌ హట్స్, వాటి వలన చెంచు గిరిజనులకు వచ్చే ఆదాయ మార్గాలపై కొందరికి అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో గిరిజన గూడెంలో 10 వరకు జంగిల్‌ కాటేజీలు ఏర్పాటు చేయ నున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.


గదులలో సౌకర్యాలు ఇలా...

త్వరలోనే జంగిల్‌ క్యాంపులు 
మరి కొద్ది రోజుల్లో జంగిల్‌ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పైలెట్‌ ప్రాజెక్టుగా జంగిల్‌ సఫారీకి అనుసంధానంగా ఉన్న తుమ్మలబైలు గిరిజన గూడేన్ని గుర్తించాం. తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్‌ క్యాంపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎకో డెవలప్‌మెంట్‌ కమిటీ ద్వారా కొంత భాగం గూడెం అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తాం. జంగిల్‌ కాటేజీలతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది.
– విశ్వేశ్వరరావు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, పెద్దదోర్నాల

నిర్మాణాలపై అధికారుల దృష్టి...
నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజనగూడెంలో జంగిల్‌ కాటేజీలు, వెదురు గుడిసెల నిర్మాణాలపై అధికారుల దృష్టి సారించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కాటేజీలలో సకల సదుపాయాలు కల్పించనున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసే టెంట్లు, కాటేజీలు, వెదురుతో కూడిన గుడిసెల్లో పర్యాటకులకు అవసరమయ్యే సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు. జంగిల్‌ కాటేజీలలో ఒక్కో గదిలో ఇద్దరు సేద తీరడానికి రెండు బెడ్లు, గదికి సీలింగ్, ఆకర్షణీయమైన విధంగా లైటింగ్‌ సౌకర్యం, విలాసవంతమైన టాయిలెట్లు, రాత్రి పూట కాంప్లిమెంటరీ భోజనం ఏర్పాటు చేయనున్నారు.

జంగిల్‌ సఫారీ చూసిన తర్వాత యాత్రికులు ఇక్కడే బస చేసేలా చర్యలు చేపడుతున్నారు. యాత్రికులు సఫారీతో పాటు రోజంతా నల్లమలలోని అటవీ ప్రాంతంలోనే గడిపే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఇందు కోసం రూ.2,500 నుంచి 3,000 వరకు వసూలు చేయనున్నారు. అటవీశాఖ చేస్తున్న ఈ ఏర్పాట్లతో గిరిజనులకు, అటవీశాఖకు మరి కొంత ఆదాయం సమకూరనుందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు