పోలవరంపై బాబువి కాకి లెక్కలు

27 Aug, 2023 05:11 IST|Sakshi

ఈ ప్రభుత్వంలో జరిగిన పనులు చూసి ఆయన ఆశ్చర్యపోయారు

గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణలో  రూ.3.5 కోట్లు భోంచేశారు

అక్టోబర్‌లో కుప్పంకు కృష్ణా జలాలు

జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి

బి.కొత్తకోట : గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని జలవనరులశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సీ నారాయణరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై శనివారం ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులపై మదనపల్లె ఎస్‌ఈ సీఆర్‌ రాజగోపాల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులు మాత్రమే చేసి సొమ్ము చేసుకున్నారు. నిజానికి.. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు అక్కడ ఆరు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చేపట్టిన పనులను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే..

  • కుప్పంకు అక్టోబర్‌లో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తాం. కుప్పం ఉపకాలువ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నాం. ఇక్కడ రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లు ప్రతిపాదించాం. 
  • అవుకు రెండో సొరంగం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడినుంచి ఒక టీఎంసీ నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలిస్తాం. గత ప్రభుత్వం ఈ పనులను వదిలేసింది. 
  • డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని 68 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి నింపుతాం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. 
  • గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు గురించి తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు తన ప్రభుత్వంలో నిర్వహణకు కేవలం రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటిన్నర పార్కు కోసం ఖర్చుచేసి.. మిగతా రూ.3.5 కోట్లను భోంచేశారు. 
  • వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేశాం. రెండో సొరంగం పనులు అక్టోబర్‌లోగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. 
  • ఇక కర్ణాటక చేపట్టిన అప్పర్‌ తుంగభద్ర ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశాం. ఆ పనులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. 
  • శ్రీశైలం జలాశయంలో 66 శాతం జలాలు ఏపీ వాటాకు వస్తాయి. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు జరగలేదని తెలంగాణ వాదించడం సరికాదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం. 
  • ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను రూ.2వేల కోట్ల వ్యయంతో పూర్తిచేయనున్నాం.
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశ ఒక టీఎంసీ సామర్థ్యంతో తాగునీటి సంబంధిత పనులు ప్రారంభమయ్యాయి.  
మరిన్ని వార్తలు