‘జగనన్న గోరుముద్ద’కు జాతీయ పురస్కారం

23 Nov, 2023 06:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ‘జగనన్న గోరుముద్ద’ పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయస్థాయి ప్రథమ బహుమతిని ఏపీకి అందజేసింది. అవార్డును స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జోయా అలీ రిజ్వీ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్‌ ఆఫీసర్‌ పి.హేమారాణి, ఆరోగ్య శాఖ నోడల్‌ అధికారి దేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోడల్‌ ఆఫీసర్‌ ఎన్‌.శ్రీదేవి అందుకున్నారు.  

విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు రాగి జావ, కోడిగుడ్డు, చిక్కీ వంటి పోషకాహారం అందించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధమిక లక్ష్యంగా ఉందని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది. దేశంలో ఇదో అద్భుతమైన కార్యక్రమంగా ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్లు పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ (వేరుశనగ బార్‌) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని కేంద్ర అధికారులు అభినందించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం లోపం తగ్గడంతో పాటు రక్తహీనత సైతం చాలావరకు నివారించారని కితాబిచ్చింది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం కోసం జగనన్న గోరుముద్ద పథకంలో రోజుకో మెనూ చొప్పున స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రూపొందించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు