AP: 11 రాష్ట్ర రహదారులకు ‘జాతీయ’ హోదా 

9 Apr, 2022 10:27 IST|Sakshi

మరో 31 రోడ్లకూ త్వరలో ఎన్‌హెచ్‌ గుర్తింపు

సాక్షి, అమరావతి: ముఖ్యమైన రహదారుల అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కీలక ‘రాష్ట్ర రహదారుల’కు జాతీయ రహదారుల హోదా సాధించడంలో మరోసారి విజయం సాధించింది. తాజాగా.. రాష్ట్రంలోని 11 రాష్ట్ర రహదారులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల హోదా ప్రకటించింది. దీంతో మొత్తం 872.52 కి.మీ. మేర జాతీయ రహదారులుగా గుర్తించారు. మరో 31 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోదా కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే 11 రాష్ట్ర రహదారులను కేంద్రం జాతీయ రహదారుల హోదా ఇచ్చింది. దేశంలోనే అత్యధికంగా జాతీయ రహదారులను ఏపీకే ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

రహదారుల అభివృద్ధిలో ముందడుగు
కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం ద్వారా వాటిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యంత రద్దీ ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా కూడా చర్చించారు. ఫలితంగా గత రెండేళ్లలో రెండు దశల్లో మొత్తం 1,173.65 కి.మీ. మేర 18 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించింది. ఇక తాజాగా మరో 872.52 కి.మీ.మేర మరో 11 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది.

ఈ మేరకు ఆ రహదారులకు గుర్తింపు సంఖ్యలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అలాగే, 2,586.52 కి.మీ. మేర మరో 31 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించేందుకు సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రధానంగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులను ఇతర ప్రధాన నగరాలు, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానించే ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించనున్నారు. దీంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకోనుంది.  

మరిన్ని వార్తలు