పాపాగ్ని నది వెంబడి ఎలాంటి మైనింగ్‌ జరగడం లేదు 

25 Jan, 2024 05:49 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

ఆ వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశం  

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో పాపాగ్ని నది వెంబడి ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటి వరకు ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇవ్వలేదని వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

పాపాగ్ని నది వెంబడి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, అలా తవ్వి తీసిన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని, అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నమయ్య జిల్లా, పెద్దతిప్ప సముద్రం మండలం, జంబుకాని పల్లి గ్రామానికి చెందిన డి.వెంకటరమణ, మరో ఇద్దరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది, టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ నది వెంబడి విచక్షణ రహితంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు.

ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. వేటి ఆధారంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెబుతున్నారని ప్రశ్నించింది. పత్రికా కథనాల ఆధారంగానని పోసాని చెప్పారు. వాటిని పరిశీలించాలని కోరారు. ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాదులు పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, కామిరెడ్డి నవీన్‌కుమార్‌లు తోసిపుచ్చారు. పిటిషనర్లు చెబుతున్న విధంగా ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలు జరగడం లేదని సుభాష్‌ చెప్పారు. ఎక్కడో తవ్వి తీసిన ఇసుక తాలుకు ఫొటోలను పాపాగ్ని వెంబడి జరిగినట్టు చూపుతున్నారని చెప్పారు. ఇసుక తవ్వకాలకు గనుల శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని నవీన్‌ తెలిపారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు