ఈ లక్షణాలు ఉన్నాయా?.. ఇలా చేసి నోటి క్యాన్సర్‌ నుంచి కాపాడుకోండి

2 Feb, 2023 15:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల ఆరోగ్యంపై జగన్‌ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉచితంగా ఖరీదైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వ్యాధికి చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వైద్యులకు శిక్షణ ఇచ్చిన అనంతరం వెల్‌స్కోప్‌ మెషీన్లు ఏర్పాటు చేసి క్యాన్సర్‌ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పొగాకు,  పొగాకు మసాలాలతో పాటు బీడీలు, సిగరెట్‌ తాగుతున్న వారిలో నోటి క్యాన్సర్‌ తీవ్రమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటున్న క్యాన్సర్‌ బాధితుల్లో ఆరు శాతం మంది నోటి క్యాన్సర్‌ (ఓరల్‌ క్యాన్సర్‌) వారే ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ముందే ఓరల్‌ క్యాన్సర్‌ను పసిగట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీతో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ప్రాథమిక క్యాన్సర్‌ దశకు రాకముందే.. లేదంటే అలాంటి లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్‌ స్థితిని ఓ పరికరం ద్వారా అంచనా వేస్తారు. ఇలాంటి పరికరాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తెచ్చింది.
చదవండి: సోలో బ్రతుకే సో 'బెటరు'

వెల్‌స్కోప్‌ మెషీన్‌ ద్వారా పరీక్షలు.. 
వెల్‌స్కోప్‌ మెషీన్‌ అంటేనే ఇదొక అత్యాధునిక వైద్యపరికరం. తరంగ దైర్ఘ్యాల నీలి కాంతిని ప్రేరేపణ చేసి నోటిలో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తుంది. క్యాన్సర్‌ వచ్చే లక్షణాలను ముందే పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. ప్రీ క్యాన్సర్‌ లక్షణాలే క్యాన్సర్‌కు దారి తీస్తాయి. వాటిని ముందే గ్రహించి చెప్పగలదు. ఇలాంటి వెల్‌స్కోప్‌ మెషీన్లను వైజాగ్, విజయవాడ, కడపలో ఏర్పాటు చేశారు. కడపలో ఏర్పాటు చేసిన ఈ మెషీన్‌ పరిధిలో 9 జిల్లాల వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఇందులో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో... 
పీహెచ్‌సీ వైద్యులకు, దంతవైద్యులకు వెల్‌స్కోప్‌ మెషీన్‌ ద్వారా శిక్షణ నిచ్చిన అనంతరం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వెల్‌స్కోప్‌ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. మెషీన్ల ఏర్పాటు అనంతరం భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇలా ముందే లక్షణాలను గుర్తించి చికిత్స చేస్తే వేలాదిమంది ప్రాణాలను కాపాడవచ్చనేది వైద్యుల అభిప్రాయం.

ఓ వైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే అదే ప్రాంతంలో మరోవైపు పొగాకు ఉత్పత్తుల వాడకం నియంత్రణపై కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైద్యులకు ఈ మెషీన్‌ ద్వారా నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు.

క్యాన్సర్‌ బారినుంచి కాపాడవచ్చు 
నోటి క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ముందస్తు లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే వ్యయభారం తగ్గుతుంది. భవిష్యత్‌లో ఇది అన్ని చోట్లా విస్తరిస్తే మరింతగా లబ్ధి కలుగుతుంది. ముఖ్యంగా పొగాకు వాడకంతో క్యాన్సర్‌కు గురయ్యేవారిని క్యాన్సర్‌ బారినుంచి కాపాడచ్చు.
 – డాక్టర్‌ శ్రీనివాసన్, క్యాన్సర్‌కేర్‌ నోడల్‌ ఆఫీసర్‌  

మరిన్ని వార్తలు