గ్రామాల్లో మొబైల్‌ యాప్‌తో ఇంటిపన్ను వసూళ్లు

22 Sep, 2021 03:51 IST|Sakshi

మాన్యువల్‌ విధానానికి స్వస్తి 

యాప్‌ను అవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి 

86 లక్షల ఇళ్ల సమాచారం ఇప్పటికే యాప్‌తో అనుసంధానం

సాక్షి, అమరావతి: ఇక నుంచి గ్రామాల్లో ఇంటి పన్నును అన్‌లైన్‌ విధానంలోనే వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటిపన్ను పూర్తి పారదర్శకంగా నూరు శాతం వసూలవుతుందని తెలిపారు.

గ్రామాల్లోని సుమారు 86 లక్షల గృహాలకు సంబంధించిన డేటాను సేకరించి, ఆ వివరాలను యాప్‌తో ఇప్పటికే అనుసంధానం చేసినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామాల్లో మాన్యువల్‌ విధానంలో ఇంటి పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇలా అన్‌లైన్‌ విధానంలో పన్ను చెల్లించిన వెంటనే అన్‌లైన్‌లోనే రశీదు తయారై, ఆ రశీదు వెంటనే పన్ను చెల్లించిన వారి మొబైల్‌ నెంబరుకు వెళ్తుందని మంత్రి చెప్పారు. అంతేకాక.. ఇంటి యజమానులకు ఎంత పన్ను చెల్లించారు.. ఇంకా ఎంత చెల్లించాలి అనే వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆయా పంచాయతీల్లోని పన్ను చెల్లింపుదారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని వివరించారు. 

పొదుపు సంఘాల కార్యక్రమాలపైనా సమీక్ష
పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పెన్షన్ల పంపిణీ అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సచివాలయంలోని తన ఛాంబరులో సెర్ప్‌ అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈఓ ఇంతియాజ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు