ఏ రాష్ట్రం తీసుకోనన్ని చర్యలు తీసుకున్నాం

6 Jan, 2021 03:36 IST|Sakshi

దేశంలో ప్రతీ మిలియన్‌కు 27,140 కరోనా టెస్టులు చేస్తున్నారు

అదే ఏపీలో 64,020 టెస్టులు చేస్తూ వచ్చాం

హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ విషయంలో దేశంలో ఏ రాష్ట్రం తీసుకోనన్ని చర్యలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. కరోనా విషయంలో దేశంలో ప్రతీ మిలియన్‌కు 27,140 పరీక్షలు చేస్తుంటే, రాష్ట్రంలో 64,020 టెస్టులు నిర్వహించామని వివరించారు. గతేడాది మార్చి 9న తొలి కోవిడ్‌ కేసు నమోదైందని.. అప్పటికి రాష్ట్రంలో టెస్టింగ్‌ సౌకర్యాల్లేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ వివరాలన్నింటితో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్‌ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ గుంటూరుకు చెందిన తోట సురేశ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, ప్రభుత్వం ఎంత గొప్పగా చేస్తున్నా విమర్శలు తప్పడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, అలా భావించాల్సిన అవసరంలేదని, మీరు (ప్రభుత్వం), మేం (కోర్టులు) ఉన్నది ప్రజల కోసమేనని, అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. తదుపరి విచారణ నాటికి ఈ వ్యాజ్యం నిరర్థకమవ్వాలని ఆశిస్తున్నామని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది.  

మరిన్ని వార్తలు