మంగంపేట గనులపై దొంగరాతలా? 

27 Jan, 2024 04:54 IST|Sakshi

మంగంపేట గనులపై దొంగరాతలా? 

బెరైటీస్‌ గనుల టెండర్లపై రామోజీ తప్పుడు కథనం 

మంగంపేటలో భారీగా పేరుకుపోయిన సీ, డీ గ్రేడ్‌ నిల్వలు  

వాటిని విక్రయించేందుకు నిబంధనల ప్రకారమే టెండర్లు 

బాబు హయాంలోని జీవో 262 గైడ్‌లైన్స్‌ ప్రకారమే రిజర్వు ధర  

టెండర్లలో వ్యయప్రస్తావన లేకున్నా అడ్డగోలు రాతలు 

ఈ తప్పుడు రాతలపై న్యాయపరంగా చర్యలు: ఏపీఎండీసీ 

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా రామోజీరావు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వంపై ఏదో ఒకలా బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తన చంద్రబాబుకు మేలు చేయాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే మంగంపేట బెరైటీస్‌ గనుల టెండర్లపైనా అడ్డగోలు రాతలు రాశారు. ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనాన్ని శుక్రవారం ఈనాడులో అచ్చేశారు. నిబంధనల ప్రకారమే అంతా సక్రమంగా జరిగినా అబద్ధాలతో ఆ కథనాన్ని నింపేశారు. అన్నమయ్య జిల్లా  మంగంపేటలో గనుల్లో ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్‌ను ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తోంది.

ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఎ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బి’ గ్రేడ్‌ కాగా, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ – డబ్ల్యూ (వేస్ట్‌)’ గ్రేడ్‌లుగా ఉంటుంది. సీ, డీ గ్రేడ్‌ ఖనిజానికి డిమాండ్‌ తక్కువగా ఉండటంతో గత కొన్నేళ్లుగా వాటి నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ బెరైటీస్‌ నిల్వలు అమ్ముడవకుండా ఉండిపోయింది. దాని విక్రయం, బెనిఫికేషన్‌ కోసం గతంలో పలుసార్లు టెండర్లు పిలిచినా సరైన స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఏపీఎండీసీ ఆ నిల్వల విక్రయానికి టెండర్లు పిలిచింది.

సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ ఖనిజానికి టెండర్లు పిలుస్తారు. కానీ కొనుగోలుదారుల నుంచి స్పందన రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 20 లక్షల టన్నుల చొప్పున ఐదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలిచారు. ఈ వాస్తవం తెలియకుండా అభూత కల్పనలతో ఒకేసారి కోటి మెట్రిక్‌ టన్నులకు టెండర్లు పిలిచారంటూ మతి లేని కథనాన్ని ఈనాడు ప్రచురించింది. సీ, డీ గ్రేడ్‌ ఖనిజానికి రిజర్వు ధరను తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. నిజానికి రిజర్వు ధర నిర్ణయానికి సంబంధించి జీవో 262ను 2017లో చంద్రబాబు హయాంలోనే విడుదల చేశారు. ఆ జీవోలోని నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు రిజర్వు ధరను నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టు రేటును పెట్టారు. 

ఎంఎస్‌టీసీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ
టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించిన ఎంఎస్‌టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర నిబంధనల ప్రకారమే ధరావత్తు ఖరారు చేశారు. 17 రోజుల్లో టెండర్లను పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే. టెండర్‌ డాక్యుమెంట్‌ ధరను ఖరారు చేసే క్రమంలో టెండర్‌ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్, కన్సల్టెన్సీ చార్జీలు, ప్రిపరేషన్, కమ్యూనికేషన్‌ చార్జీలు, ఎంఎస్‌టీసీ చెల్లింపులకయ్యే మొత్తాన్ని లెక్కించి ధర నిర్ణయించారు. సాధారణంగా ఏ సంస్థ అయినా అనుసరించే ఈ విధానాన్ని ఈనాడు మాత్రం అక్రమం అంటూ చిత్రీకరించడం విడ్డూరం.

న్యాయ సమీక్షకు పంపలేదంటూ అవగాహనారాహిత్యాన్ని ఆ కథనంలో చూపించింది. రూ.100 కోట్లకుపైగా వ్యయం అయ్యే ప్రాజెక్టును నిర్వహించే టెండర్లను మాత్రమే న్యాయ సమీక్షకు పంపుతారు. బెరైటీస్‌ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం లేకుండా ఆ కథనాన్ని ప్రచురించినట్లు స్పష్టమవుతోంది. దుర్బుద్ధితోనే ఈ కథనం రాసినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం
నాణ్యమైన బెరైటీస్‌తో పాటు సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌ ఖనిజాన్ని ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను దోపిడీగా చిత్రీకరించడం దారుణం. ఈ తప్పుడు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, వీసీ అండ్‌ ఎండీ, ఏపీఎండీసీ 

whatsapp channel

మరిన్ని వార్తలు