Stolen children: పొత్తిళ్లలో విడిపోయి 19 ఏళ్లకు కలిశారు

27 Jan, 2024 04:55 IST|Sakshi

కవలలను కలిపిన టిక్‌టాక్‌ వీడియో

కన్న తల్లి ఒడిలో పెరిగి జంటగా ఆడుకోవాల్సిన కవల అమ్మాయిలు వీరు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఆస్పత్రుల్లో పుట్టిన పసికందులను దొంగలించి పిల్లల్లేని జంటలకు అమ్మేసే ముఠా బారిన పడి కన్నతల్లి ప్రేమకు దూరమయ్యారు. ఎందరో చిన్నారులను మొబైల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేసే టిక్‌టాక్‌ వీడియో ఒకటి వీరిద్దరినీ మళ్లీ కలిపింది. అందుకు ఏకంగా 19 సంవత్సరాల సమయం పట్టింది. అచ్చం తనలా ఉన్న అమ్మాయిని చూసి ఎవరీమె? ఎందుకు నాలాగే ఉంది? అంటూ ఒకరిని వేధించిన ప్రశ్నలు చివరకు తన కవల సోదరి చెంతకు చేర్చాయి. ఈ గాథ ఐరోపాలోని జార్జియాలో జరిగింది...

ఈ కథ 2002 ఏడాదిలో జార్జియాలోని కీర్ట్‌స్కీ ప్రసూతి ఆస్పత్రిలో మొదలైంది. గోచా ఘకారియా దంపతులకు కవల అమ్మాయిలు పుట్టారు. వెంటనే తల్లి అజా షోనీకి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లింది. తను చనిపోతే పసికందులను పెంచడం తన వల్ల కాదని గోచా భావించాడు. ఇదే అదనుగా అక్కడున్న పిల్లల్ని దొంగలించే ముఠా అతనికి డబ్బులు ఎరవేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది.

అచ్చం తనలా ఉండటంతో అవాక్కై..
పిల్లలను ఆ దొంగల ముఠా వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు కుటుంబాలకు పెద్ద మొత్తాలకు అమ్మేసింది. పెంపుడు తల్లిదండ్రులు ఆ చిన్నారులకు అమీ ఖవీటియా, అనో సర్టానియా అని పేర్లు పెట్టారు. చూస్తుండగానే పుష్కరకాలం గడిచిపోయింది. 12 వయసు ఉన్నపుడు అమీ 2014 సంవత్సరంలో ఓ రోజు టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాంలో అచ్చం తనలా ఉన్న ఓ 12 ఏళ్ల అమ్మాయి డ్యాన్స్‌ చేయడం చూసి అవాక్కైంది.

కలిపిన టిక్‌టాక్‌
అమీకి కూడా డ్యాన్స్‌ అంటే ప్రాణం. డ్యాన్స్‌ నేర్చుకుంది. ఏడేళ్ల తర్వాత అమీ ఒక టిక్‌టాక్‌ వీడియో తీసి అప్‌లోడ్‌ చేసింది. అది తెగ వైరల్‌ అయింది. దానిని అమీ సొంతూరుకు 320 కిలోమీటర్ల దూరంలోని టిబిలిసీ నగరంలోని కవల సోదరి అనో సర్టానియా స్నేహితురాలు చూసింది. ఆ వీడియో సర్టానియోది అనుకుని భ్రమపడింది. సర్టానియోకు షేర్‌ చేసి విషయం కనుక్కోమని చెప్పింది. తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సర్టానియోకు అనుమానం వచ్చింది. ఈమె నాకు బంధువు అవుతుందా? అసలు ఈ టీనేజర్‌ ఎవరు? అంటూ తను చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టులుపెట్టేది. ఈ గ్రూప్‌లో అమీకి తెల్సిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్‌ నంబర్‌ ఒకరికి అందింది. అందజేశారు. దీంతో అమీ, అనో మొట్టమొదటిసారిగా మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం మొదలైంది.  

ఎన్నెన్నో పోలికలు
వేర్వేరు కుటుంబ వాతావరణాల్లో పెరిగినా ఇద్దరి అభిరుచులూ ఒకటే. డ్యాన్స్‌ ఇష్టం. హెయిర్‌ స్టైల్‌ ఒక్కటే. ఇద్దరికీ ఒకే జన్యు సంబంధమైన వ్యాధి ఉంది. సరి్టఫికెట్లలో పుట్టిన తేదీ కూడా చిన్న తేడాతో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఒకే వయసు ఉన్నారు. సరి్టఫికెట్లలో ఆస్పత్రి పేరు కూడా ఒక్కటే. ఇన్ని కలవడంతో తాము కవలలమేమో అని అనుమానం బలపడింది. కానీ ఇరు కుటుంబాల్లో ‘నువ్వు మా బిడ్డవే’ అని చెప్పారుగానీ కొనుక్కున్నాం అనే నిజం బయటపెట్టలేదు. వీళ్ల మొండిపట్టు చూసి నిజం చెప్పేశారు. కానీ వీళ్లు కవలలు అనే విషయం వారికి కూడా తెలీదు. ఎందుకంటే వీరికి అమ్మిన ముఠా సభ్యులు వేర్వేరు. దీంతో తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేది మిస్టరీగా ఉండిపోయింది. పెంచలేక వదిలేశారని అనో ఆగ్రహంతో రగిలిపోయింది. కన్న వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్‌సైట్లు, గ్రూప్‌లలో అన్వేషణ ఉధృతం చేసింది. ఇందుకోసం సొంతంగా ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించింది.

మూడో తోబుట్టువు!
ఆ నోటా ఈనోట విన్న ఒక టీనేజర్‌.. అమీకి ఫోన్‌ చేసింది. తన తల్లి 2002లో ఒక మెటరి్నటీ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచి్చందని, వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అమీకి వివరించింది. వెంటనే అమీ అక్కడికి వెళ్లి ఆ టీనేజర్, ఆమె కన్నతల్లి డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయించింది. అవి తమ డీఎన్‌ఏలతో సరిపోలాయి. అలా ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులో లీపెగ్‌ నగరంలో కవలలు కన్నతల్లిని కలిసి తనివి తీరా కౌగిలించుకున్నారు. దాంతో ఆమెకు నోట మాట రాలేదు. కోమా నుంచి కోలుకున్నాక మీరు చనిపోయారని భర్త చెప్పాడని కన్నీరుమున్నీరైంది. ఈ మొత్తం ఉదంతం తాజాగా వెలుగు చూసింది.

లక్షల శిశు విక్రయాలు  
ట్యాక్సీ డ్రైవర్లు మొదలు ఆస్పత్రి సిబ్బంది, అవినీతి అధికారులదాకా ఎందరో ఇలా జార్జియాలో పెద్ద వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి లక్షల మంది పసికందులను ఆస్పత్రుల్లో మాయం చేశారని అక్కడి మీడియాలో సంచలనాత్మక కథనాలు వెల్లడయ్యాయి. దీనిపై ప్రస్తుతం జార్జియా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

whatsapp channel

మరిన్ని వార్తలు