అవయవదానంతో అమరుడయ్యాడు

27 Sep, 2023 04:19 IST|Sakshi

అవయవదానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపి..

గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, రెండు కళ్లు దానం!

సీఎం జగన్‌ చొరవతో వేగంగా అవయవాల తరలింపు..

గ్రీన్‌చానల్‌ ద్వారా తిరుపతికి గుండె, విశాఖకు కాలేయం!

గుంటూరు: తాను మరణిస్తూ ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కట్టా కృష్ణ అనే యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్‌డెడ్‌ అయిన కృష్ణ అవయవదానంతో అమరుడు అయ్యాడు. పుట్టెడుదుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరిపేట శాంతినగర్‌కు చెందిన కట్టా కృష్ణ (18) ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈనెల 23న కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. తలకి బలమైన గాయం తగలటంతో చికిత్స నిమిత్తం గుంటూరు రమేశ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు  చేసిన ప్రయత్నాలు ఫలించక  కృష్ణ ఈనెల 25న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ముగ్గురి సంతానంలో ప్రథముడైన కృష్ణ మరణాన్ని తల్లిదండ్రులు రాజు, మల్లేశ్వరి జీర్ణించుకోలేక పోయారు. అనంతరం తమ బిడ్డ దూరమైనా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి తమ కుమారుడి అవయ వదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కృష్ణ గుండెను తిరుపతికి, కాలేయాన్ని విశాఖపట్నంకు, రెండు కిడ్నీల్లో ఒకటి విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికి, రెండోది గుంటూరు రమేశ్‌ ఆస్పత్రికి, రెండు కళ్లు (ఇద్దరికి అమర్చేందుకు) గుంటూరులోని సుదర్శిని ఆస్పత్రికి తరలించారు.
విజయవంతంగా గుండె మార్పిడి
తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు వైద్యుల బృందం సుమారు 5.10 గంటలపాటు కష్టపడి గుండెమార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు.

గుంటూరు నుంచి వచ్చిన కృష్ణ గుండెను కర్నూలుకు చెందిన శ్రీనివాసన్‌ (33)కు అమర్చారు. శ్రీనివాసన్‌ గుండె సంబంధిత సమస్యతో మూడు నెలల క్రితం శ్రీపద్మావతి ఆస్పత్రికి వచ్చాడు. అతనికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్‌ గణపతి మార్పిడి అనివార్యమని తేల్చారు. అవయవదాన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయించారు. ఈ క్రమంలో కృష్ణ అవయవదానంతో శ్రీనివాసన్‌కు చికిత్స చేశారు.

విశాఖలో గ్రీన్‌చానెల్‌..
కృష్ణ కాలేయాన్ని తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ విమానాశ్రయంకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్‌ ద్వారా షీలానగర్‌ కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తరలించారు. విమానాశ్రయం నుంచి 6 నిమిషాల్లోనే ఆస్పత్రికి కాలేయాన్ని చేర్చారు. సకాలంలో అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరేందుకు ట్రాఫిక్‌ పోలీసులు విశేష కృషి చేశారు.

సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ..
ఓ ప్రాణం నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతలా ఆతృత పడతారో మరోసారి నిరూపించారు. డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి సీఎంవోతో చర్చలు జరిపిన నేపథ్యంలో గుండె మార్పిడి అవసరాన్ని ఉన్నతాధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా, వేగంగా తరలించేందుకు ప్రత్యేక చాపర్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అలానే రూ. 13 లక్షలు ఖరీదైన గుండె మార్పిడి వైద్యానికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ఫండ్‌ నుంచి నిధులను మంజూరు చేయించారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా గన్నవరం విమానాశ్రయంకు గుండెను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక చాపర్‌ ద్వారా తిరుపతి విమానాశ్రయంకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా 23 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు