గొర్రెలకు అరుదైన గుర్తింపు

21 Sep, 2023 04:59 IST|Sakshi

నాగావళి, మాచర్ల జాతులకు అధికారిక గుర్తింపునిచ్చిన ఎన్‌బీఏజీఆర్‌

ఎస్‌వీవీ యూనివర్సిటీ కృషి ఫలితం

ఏపీ పశుగణాభివృద్ధిలో కీలక ముందడుగు

సాక్షి, అమరావతి: శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (ఎన్‌బీఏ జీఆర్‌) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్ర­పడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యా­లయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొంద­లకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంక­టేశ్వర పశువైద్య విశ్వ­విద్యా­లయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపా­టు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. 

అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయల­సీమ ప్రాంతవాసులు తా­ము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొ­నా­ల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొంద­లేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉప­యోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి.

కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర
మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్‌ నగర్‌ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి.

నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. 

యుద్ధాలు చేసిన గొర్రెలివి 
నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి.

ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

కీలక ముందడుగు
నాగావళి, మాచర్ల గొర్రె జాతులకు గుర్తింపు లభించడం ఏపీ పశు గణాభివృద్ధిలో కీలకమైన ముంద­డుగు. 15 ఏళ్లుగా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు, అధ్యయనం ఎట్టకేలకు ఫలించాయి. గుర్తింపుతో ఈ జాతుల పరిరక్షణకు పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయి. – డాక్టర్‌ కె.సర్జన్‌రెడ్డి, రీసెర్చ్‌ డైరెక్టర్, ఎస్‌వీవీ విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు