తగ్గిన విద్యుత్‌ వినియోగం

28 Aug, 2020 07:49 IST|Sakshi

ఏప్రిల్‌ – జూన్‌లో 13.80 శాతం తగ్గుదల

11.27 శాతం పెరిగిన గృహ విద్యుత్‌

వాణిజ్య విద్యుత్‌ 39.75 శాతం డౌన్‌  

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు మందగించడంతో  ఏప్రిల్‌–జూన్‌ మధ్య రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 2,106.6 మిలియన్‌ యూనిట్లు తగ్గింది. మరోవైపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్తు వినియోగం మాత్రం 11.27 శాతం పెరిగింది. వ్యవసాయ విద్యుత్‌ వాడకం మే నెలలో మాత్రమే 5 శాతం మేర పెరిగింది. పారిశ్రామిక విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేని విధంగా 30.72 శాతం పడిపోయింది. విద్యుత్తు వినియోగంపై తొలి త్రైమాసికం నివేదికను ఇంధనశాఖ గురువారం మీడియాకు వెల్లడించింది. ఏపీఈఆర్‌సీకి గతంలో సమర్పించిన అంచనాలు తలకిందులు కావడంతో వాస్తవ చిత్రాన్ని సమర్పించనున్నారు.

గతేడాది తొలి త్రైమాసికంలో అన్ని విభాగాల విద్యుత్‌ వినియోగం 15,262.64 మిలియన్‌ యూనిట్లు కాగా ఈ ఏడాది ఇదే సమయంలో 13,156.04 మిలియన్‌ యూనిట్లు (13.80 శాతం తక్కువ) నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 5,221.37 ఎంయూలుగా ఉన్న ఉన్న డిమాండ్‌ ఈ ఏడాది 4,076.95 ఎంయూలకు పడిపోయింది. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే సర్వీసులన్నీ ఆగిపోవడం విద్యుత్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది తొలి  త్రైమాసికంలో 390.83 మిలియన్‌ యూనిట్లున్న విద్యుత్‌ డిమాండ్‌ ఈ ఏడాది 262.77 ఎంయూలకు పడిపోయింది. ఒక్క మే నెలలోనే 42.71 శాతం పడిపోయింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు