ప్రవేశాలు పెరిగాయ్‌ 

13 Dec, 2023 05:15 IST|Sakshi

రాష్ట్రాలవారీగా గణాంకాలను వెల్లడించిన ఆర్బీఐ నివేదిక   

అన్ని తరగతుల్లోనూ భారీగా పెరిగిన స్థూలనమోదు నిష్పత్తి 

బాలురుతో పాటు బాలికల నమోదు నిష్పత్తిలోనూ పెరుగుదల 

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విద్యా సంస్కరణల ఫలితం 

విద్యా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతతో సాకారమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత సర్కారు హయాంతో పోలిస్తే అన్ని తరగతుల్లోనూ స్థూల నమోదు నిష్పత్తి పెరిగినట్లు ఇటీవల విడుదలైన ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా స్థూల నమోదు నిష్పత్తి వివరాలను రూపొందించింది. 2018–19తో పోలిస్తే 2021–22లో ఉన్నత విద్యలో బాలురు, బాలికల నమోదు నిష్పత్తి భారీగా పది శాతం మేర పెరగడం గమనార్హం.

ఇందుకు ప్రధాన కారణం విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని స్పష్టం అవుతోంది. విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహిస్తూ అమ్మ ఒడితోపాటు జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యా బోధనను ప్రభుత్వం అందుబాటులోకి తేవటమేనని స్పష్టమవుతోంది.

మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా ఇంగ్లిష్‌ మీడియం చదువులను సైతం అందుబాటులోకి తెచ్చింది. 2018–19లో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 46.9 శాతం ఉండగా 2021–22లో 56.7కి పెరిగింది. బాలుర స్థూల నమోదు నిష్పత్తి 45.4 నుంచి 55.2కు పెరగగా బాలికల స్థూల నమోదు నిష్పత్తి 48.5 నుంచి 58.3కి పెరిగింది.  

>
మరిన్ని వార్తలు