ఆరోగ్యశ్రీ కార్డుంటే.. రూ.25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే

25 Dec, 2023 04:35 IST|Sakshi

3,257 ప్రొసీజర్స్‌లో రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స

చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ప్రభుత్వ సాయం

కొత్త స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తూ పథకం ప్రయోజనాలపై ప్రచారం

ఇప్పటివరకు 1.04 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరి­కైనా జబ్బు చేసినా.. ప్రమాదం సంభవించినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ఆరో­­గ్యశ్రీ కార్డు వెంటబెట్టుకుని మీ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ వైద్య సిబ్బంది ఆరో­గ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తు­న్నా­రు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది.

ఈ క్రమంలో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్‌ కార్డులను అందజేస్తూ.. పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన 1.48 కోట్ల స్మార్ట్‌ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా కార్డుల పంపిణీ చేస్తు­న్నారు. కాగా.. ఇప్పటివరకు 1,04,326 కార్డుల పంపిణీ పూర్తి అయింది. ఒక్కో వారంలో నియో­జకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.

సేవలు పొందడం ఇలా..
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు, ఏఎన్‌ఎం, సీహెచ్‌వో, వలంటీర్‌లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను 1,059 రోగాల నుంచి 3,257 రకాల రోగాలను పెంచారు. ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందగలగటం వంటి ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారు. సులువుగా ప్రజలు పథకం సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్‌ను ప్రతి ఇంటిలో మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్‌ చేయించి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా.. గడచిన వారంలో లక్షకు పైగా లబ్ధిదారుల ఫోన్ల ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. యాప్‌లో లాగిన్‌ అవ్వడం ద్వారా పథకం కింద అందే వైద్య సేవలు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు ప్రజలకు వివరించారు.

పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 104కు ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు. పనిలో పనిగా మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ను మహిళల ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, అత్యవసర సమయంలో యాప్‌ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు