50% ప్రయాణికులతోనే ఆర్టీసీ బస్సులు

28 Apr, 2021 05:05 IST|Sakshi

25 శాతం బస్సు సర్వీసుల తగ్గింపు

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే మంగళవారం నుంచి అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఈ నెలలో రోజుకు సగటున 57 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది.

సోమవారం ఆక్యుపెన్సీ రేటు 50 శాతానికే పరిమితమైంది. దాంతో ఆర్టీసీ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. సగటున రోజుకు రూ.14 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7 కోట్లే వస్తోంది. దాంతో ఆర్టీసీ తమ బస్సు సర్వీసులను తగ్గించింది. డిమాండ్‌ అంతగాలేని రూట్లలో సర్వీసుల్లో కోత విధించింది. ఆర్టీసీ రోజూ 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించాలి. కానీ వాటిలో 25 శాతం సర్వీసులను తగ్గించింది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, కార్యాలయాల్లో కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు