Banking Services: ఏపీలో మోడరన్‌ బ్యాం‘కింగ్‌

20 Jul, 2021 04:09 IST|Sakshi

’ఆధునిక బ్యాంకింగ్‌ సేవల వైపు గ్రామీణ ప్రజల మొగ్గు

దేశంలో 4వ స్థానంలో నిలిచిన ఏపీ

నాబార్డు ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ సర్వేలో వెల్లడి

అందరికీ బ్యాంకింగ్‌ సేవల్లో అద్భుత పనితీరు కనపరుస్తున్న రాష్ట్రం  

సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్‌ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్‌ నంబర్‌ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్‌ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్‌ బ్యాంకింగ్‌ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి.

యాప్‌ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్‌ కోడ్‌ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్‌ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్‌ ఆలిండియా రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ సర్వే(ఎన్‌ఏఎఫ్‌ఐఎస్‌)లో వెల్లడైంది. మోడరన్‌ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్‌ సేవల వినియోగంతో పాటు ఎన్‌ఏఎఫ్‌ ఇండెక్స్‌లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్‌ కనబరిచింది. 

రూపే కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌తో ముందుకు.. 
ఎన్‌ఏఎఫ్‌ ఇండెక్స్‌లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్‌ బ్యాంకింగ్‌ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్‌ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్‌ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్‌తో అనుసంధానం, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్‌ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్‌ధన్‌ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్‌ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లున్నాయి.

పూర్తి డిజిటల్‌ జిల్లాగా వైఎస్సార్‌ 
రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్‌ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్‌  జిల్లాను 100 శాతం డిజిటల్‌ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్‌ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్‌ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్‌ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు