చిన్న ఉపగ్రహాల కోసం ఎస్‌ఎస్‌ఎల్‌వీ

24 Jan, 2021 09:32 IST|Sakshi

తమిళనాడులో ప్రయోగకేంద్రం ఏర్పాటు 

ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ, విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.గత ఏడాదిలోనే ప్రయోగం చేపట్టాలని అనుకున్నప్పటికి కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ డిజైన్‌ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు.

ప్రపంచ మార్కెట్‌లో అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయం భారత్‌ నేడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా అవతరించింది. 2022 ఆఖరు నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా వంద కిలోలు నుంచి 500 కిలోలు బరువు కలిగిన 6000 వేలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా 33 దేశాలకు చెందిన 328 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్‌ అవిర్భవించింది.

నూతన ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కృషి
కొత్త ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్నం అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన చేసి భూసేకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించాలని అనేక దేశాల నుంచి వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను పంపించాల్సిన వ్యవహారానికి మంచి డిమాండ్‌ ఉండడంతో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందిస్తున్నారు.  

ఎస్‌ఎస్‌ఎల్‌వీ రూపు రేఖలు ఇలా.. 
స్మాల్‌ శాటిలైట్‌ లాంఛింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. 34 మీటర్లు ఎత్తు, రెండు మీటర్లు వ్యాసార్థం కలిగి వుంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు దాకా వుంటుంది. 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టే విధంగా డిజైన్‌ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్‌ పొజిషన్‌లో పెట్టి ప్రయోగించనున్నారు. అంటే ఇస్రో మొదటి రోజుల్లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను కూడా వర్టికల్‌ పొజిషన్‌లోనే పెట్టి ప్రయోగించారు. దీనికి షార్‌ కేంద్రంలో పాత లాంచ్‌ప్యాడ్‌ కూడా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ లాగానే నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు మొదటి, మూడో దశలు ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మాత్రం మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతోనే చేస్తారు. ఇందులో ద్రవ ఇంధనం దశమాత్రం వుండదు. నాలుగోదశలో మాత్రం వెలాసిటీ టైమింగ్‌ మాడ్యూల్‌ అనే దశ కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెడతారన్నమాట. 2022 ఆఖరు నాటికి 6000 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ రాకెట్‌ను రూపొందించారు. ఇక విదేశీ ఉపగ్రహాలన్నింటిని ఈ రాకెట్‌ ద్వారా ప్రయోగించనుండడం కొసమెరుపు.

ఆస్ట్రోనాట్ ‌విద్యార్థులకు అనుగుణంగా... 
దేశీయంగా పలు యూనివర్శిటీలకు చెందిన ఆస్ట్రోనాట్‌ విద్యార్థులు ఎక్స్‌ఫర్‌మెంటల్‌గా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వాణిజ్యపరంగా విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భవిష్యత్తులో ఈ రాకెట్‌ ఉపయోగపడనుంది. విద్యార్థులను అంతరిక్ష ప్రయోగాలల్లో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి శాస్త్రవేత్తలుగా మార్చాలన్న లక్ష్యంతో ఇస్రో దృష్టిసారించింది.

ఆ మేరకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని అందించి ప్రోత్సహిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఎస్‌ఎఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆనంద్‌–01 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు