రూ.1,712.21 కోట్ల ప్రాధాన్యత పనులు మంజూరు 

29 Sep, 2023 03:01 IST|Sakshi

ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తి 

ప్రాధాన్యత పనులను వేగవంతం చేయండి 

జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం      

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వా­ర్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ఎమ్మె­ల్యే­లు గుర్తించిన ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తయ్యా­యి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004  సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక సదుపాయా­ల అంతరాలను గుర్తించి ప్రాధాన్య పనులుగా చేపడుతున్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను సందర్శిస్తున్న సందర్భంగా ఒక్కో సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనుల కోసం రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తయిన పనులకు బిల్లులూ చెల్లిస్తోంది.

ఇప్ప­టి వరకు 9,381 సచివాలయాల పరిధిలో గుర్తించిన రూ.1,876.20 కోట్ల విలువైన 50,117 పనులను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో ఇప్పటికే 8,562 సచివాలయాల పరిధిలో రూ.­1,712.21 కోట్ల విలువైన 43,685  ప్రాధాన్యత పనులు మంజూరు చేయగా.. 7,702 సచివాలయాల పరిధిలో 39,089 ప­ను­లను ప్రారంభించారు. పనులను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం, వాటిని వెంటనే మంజూరు చేయడం, అనంతరం వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రి­య­గా కొనసాగుతోంది.

ఈ విషయంలో వెనుకబడిన జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షించి త్వరగా పను­లు మంజూరు చేయించి, ప్రారంభింపజేయాల­ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  

మరిన్ని వార్తలు