Prathipadu: ఆ పులి ఎక్కడిది!?

13 Jun, 2022 04:43 IST|Sakshi

ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అధ్యయనం

ఇది ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న అటవీ శాఖ

దాని రూటు, ఆ ప్రాంతంలో ఉన్న పులుల గురించి తెలుసుకునేందుకు కసరత్తు

ఏపీ–ఒడిశా మధ్య పులుల కొత్త కారిడార్‌పై ఊహాగానాలు

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. దాన్ని పట్టుకోవడంతోపాటు అది ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం సవాలుగా మారింది. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. తొలుత.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో పశువులు మాయమవడంతో మొదట ఏదో అడవి జంతువు వచ్చినట్లు భావించారు.

వరుసగా పశువులు మాయమవుతుండడం, వాటి కళేబరాలు కనబడుతుండడంతో స్థానికులు పులి తిరుగుతున్నట్లు చెబుతూ వచ్చారు. దీంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అడుగుల ముద్రలు ఇతర గుర్తుల ఆధారంగా దాన్ని పులిగా నిర్థారించారు. మొదట్లో అది పోలవరం ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో తిరిగింది. ఆ తర్వాత ఆహారం, నీరు దొరికే ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ వచ్చింది.

దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు కెమెరాలు ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల బోన్లు పెట్టినా అది చిక్కలేదు. పులుల సంచారం, వాటిని దారి మళ్లించడంలో నిష్ణాతులైన శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు సిబ్బంది అక్కడికి వెళ్లి పులిని పట్టుకోవడం లేదా దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసినట్లు కాకినాడ డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు తెలిపారు.

ఒడిశా నుంచే వచ్చిందా?
3–4 ఏళ్ల వయసున్న ఈ పులి ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు, విశాఖ అటవీ ప్రాంతం మీదుగా ఇది ప్రత్తిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అంచనా వేస్తోంది. పాపికొండల అభయారణ్యంలో నాలుగైదు పులులు ఉన్నా ఇది అక్కడి నుంచి వచ్చింది కాదని చెబుతున్నారు.

ఇది కచ్చితంగా ఒడిశా నుంచి వచ్చిందే అయ్యుంటుందనే ఉద్దేశంతో అటువైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి తెలుసుకునేందుకు అటవీ శాఖ ఇప్పటికే ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ)ని సంప్రదించారు. ఒడిశాలోని సత్‌కోసియా, సిమిల్‌పాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో ఉన్న పులుల వివరాలను సేకరిస్తున్నారు.

అక్కడి నుంచి ఇది ఏపీకిలోకి ప్రవేశించిందా అన్న కోణంలో విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా దేశంలోని టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో ఉన్న పులుల వివరాలన్నీ ఎన్‌టీసీఏ వద్ద ఉంటాయి. కెమెరాల ట్రాప్‌ ద్వారా ఆ టైగర్‌ రిజర్వులోని ప్రతి పులికి ఒక కోడ్‌ ఇచ్చి గుర్తిస్తారు. అలా అక్కడి జాబితాలో ఉన్న పులులతో ఇక్కడ తిరుగుతున్న పులిని పోల్చి చూస్తారు. 

ఇది ఆ జాబితాలోని పులేనా!?
ఒకవేళ ఇక్కడ తిరుగుతున్న పులి ఆ జాబితాలోనిది అయితే అది ఏ మార్గంలో వచ్చిందో అధ్యయనం చేస్తారు. అదే జరిగితే ఈ మార్గం గుండా కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లే. అంటే ఏపీ, ఒడిశా మధ్య కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లు నిర్థారిస్తారు. ఇటీవల నల్లమల నుంచి శేషాచలం అడవులకు ఇలాగే కొత్త పులుల కారిడార్‌ ఏర్పడింది.

ఇదే తరహాలో కొత్త కారిడార్‌ ఏర్పడిందా అనే అనుమానాలు అటవీ శాఖాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, దీన్ని నిర్థారించడం అంత సులువు కాదని, ఎన్నో అధ్యయనాలు, ఆధారాలు కావాలని చెబుతున్నారు. అక్కడి పులుల జాబితాలో ఇది లేకపోతే ఈ పులి ఎక్కడిదో అన్నది మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. లేకపోతే అక్కడి కెమెరా ట్రాప్‌లకు దొరక్కుండా అయినా ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే చాలా సమయం పడుతుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఎన్‌టీసీఏ ద్వారా ఈ పులి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.  (క్లిక్‌: పచ్చగడ్డి కూడా మొలవని భూమిలో పండ్ల తోటలు)

మరిన్ని వార్తలు