మేమున్నామనీ.. మీకేం కాదని..

26 Jul, 2020 05:36 IST|Sakshi

కోవిడ్‌ బాధితులకు అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్ల బాసట

అండదండగా నిలుస్తున్న ఇరుగు పొరుగు కుటుంబాలు

ఉదయం టిఫిన్‌ మొదలు.. రాత్రి భోజనాల వరకు అందజేత  

బెజవాడ బెంజి సర్కిల్‌ సమీప కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అధికారికి కరోనా సోకింది. ఆయన కుమార్తె డాక్టర్‌. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారందరికీ ఈ విషయం తెలిసింది. అంతా ఒక్కటై.. ‘కరోనా సోకిన విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదు. వెంటనే ఆస్పత్రికి వెళ్లండి. లేదంటే తక్షణమే ఫ్లాట్‌ ఖాళీ చేయండి’ అని రభస చేశారు. వారిలో ఒకరు కల్పించుకుని.. ‘వాళ్లని వెళ్లగొట్టడం కంటే.. మనమంతా సహకరిద్దాం. ఆ కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే క్వారం టైన్‌లో ఉంటారు. వాళ్లను బయటకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకుందాం. వారి అవస రాల్ని ఒక్కో రోజు ఒక్కో కుటుంబం నుంచి తీరుద్దాం.

ఇలాంటి సమయంలోనే కదా ఒకరికొకరం సాయపడాలి’ అన్నారు. అందరికీ ఆ మాటలు నచ్చాయి. ఇప్పుడక్కడ భయానికి బదులు మానవత్వం వెల్లివిరుస్తోంది. ఇది ఒక్క బెంజి సర్కిల్‌ ప్రాంతానికే పరిమితం కాలేదు. విజయవాడ నగర పరిధిలోని పటమట, ఎల్‌ఐసీ కాలనీ, కానూరు తదితర ప్రాంతాలతో పాటు గుంటూరు, కర్నూలు నగరాల్లోని అపార్ట్‌ మెంట్లలోనూ ఇలాంటి పద్ధతులే నడుస్తు న్నాయి. ‘ఒకరికి ఒకరం తోడుగా ఉందాం.. మానవతా దృక్పథంతో స్నేహాన్ని మరింత పదిలపర్చుకుందాం. కరోనాను తరిమేద్దాం’ అంటూ అంతా కూడబలుక్కుంటున్నారు. ఇందుకు అపార్ట్‌మెంట్‌ కమిటీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి. 

సాక్షి నెట్‌వర్క్‌: కరోనా.. అమ్మానాన్నల ప్రేమాభిమానాలను దూరం చేస్తోంది. అన్నదమ్ములను దరిచేరనీయడం లేదు. అక్కా చెల్లెళ్లు ఒకచోట చేరలేని దుస్థితి. అత్త మామల పలకరింపులు లేవు. ప్రాణ స్నేహితులూ పరాయి వాళ్లవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజలు క్రమంగా తమ ఆలోచనా ధోరణులను మార్చుకుంటున్నారు. కరోనా బాధితుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారు.

తోడుగా నిలుస్తూ.. తోడ్పాటు అందిస్తూ..
► తొలినాళ్లలో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే.. అందరూ ఆ వ్యక్తిని, ఆ ఇంటిని, ఇరుగు పొరుగు వారిని సైతం వెలి వేసినట్టు చూశారు. 
► నిర్ణీత దూరం పాటిస్తూ.. మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ.. సహాయం అందిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారనే అవగాహన క్రమంగా పెరు గుతుండటంతో ‘మేమున్నామంటూ..’ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొస్తున్నారు.
► బాధితునితో పాటు ఆ కుటుంబంలోని సభ్యు లందర్నీ ఇంట్లోనే ఉంచి.. రోజువారీ అవసరాలు తీరుస్తున్నారు. ఎవరెవరికి.. ఎప్పుడెప్పుడు.. ఏమేం కావాలో ఫోన్‌ ద్వారా తెలుసుకుని మరీ సమయానికి ఇస్తున్నారు. మందులు, ఇతరత్రా వస్తువులనూ తెచ్చిస్తున్నారు.
► గుంటూరు శ్యామలా నగర్‌లోని అపార్ట్‌మెంట్‌ వాసులు సమావేశమై తమ అపార్ట్‌మెం ట్‌లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే సంబంధిత వ్యక్తి తోపాటు కుటుంబీకులంతా హోమ్‌ క్వారం టైన్‌లో ఉండాలని తీర్మానించుకుని.. బాధితుల కు ఇతర కుటుంబాల వారు సాయం చేస్తున్నారు. 
► కర్నూలు నగరంలోని గాయత్రి అపార్ట్‌మెంట్‌లో ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే అసోసియే షన్‌ ప్రెసిడెంట్‌కు ఫోన్‌ చేసి.. ఆ కుటుంబం మొత్తం హోమ్‌ ఐసోలేషన్‌కు వెళ్తున్నారు.
► వారికి బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్‌ వంటివి రోజుకొక ఫ్లాట్‌ వారు  సిద్ధం చేసి.. డిస్పోజబుల్స్‌లో సర్ది బాధితుల డోర్‌ వద్ద పెట్టి ఫోన్‌ చేసి చెబుతున్నారు. 

పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఇలా..
► విజయవాడ వన్‌టౌన్, పశ్చిమ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల సంఘాల నాయకులు తమ వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. క్వారంటైన్‌లో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

వాళ్ల సాయంతోనే కోలుకున్నా 
ఇటీవల కరోనా బారిన పడ్డా. ఈ విష యాన్ని అపార్ట్‌మెంట్‌ కమిటీ ప్రెసి డెంట్‌కు చెప్పా. నా ఇద్దరు పిల్లలతో 15 రోజుల పాటు హోమ్‌ క్వారం టైన్‌లో ఉన్నా. అపార్ట్‌మెంట్‌ కమిటీ, నా తోటి స్టాఫ్, వారి కుటుంబ సభ్యులే అన్నీ తెచ్చి ఇచ్చేవారు. వాళ్ల సాయంతో త్వరగానే కోలుకున్నా.
–సోమేశ్వరి, స్టాఫ్‌ నర్సు, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

కోలుకునే వరకు ఇస్తూనే ఉంటా
మా అపార్ట్‌మెంట్‌లో ఒకాయనకు కరోనా సోకడంతో భార్య, ఇద్దరు పిల్లలతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వారికి  వారానికి సరి పడా కూరగాయలు ఇచ్చి వచ్చా. ఇతర నిత్యా వసర సరుకులు, పాల ప్యాకెట్లు అందజేశా. ఈ పనిని కొందరు తప్పు పట్టారు. కుటుంబ యజ మాని పూర్తిగా కోలుకుని బయటకు వచ్చేవరకూ వారి అవసరాలు తీరుస్తా.
–డి.శ్రీనివాస్, దాన వాయిపేట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా

మరిన్ని వార్తలు