బాబు మాజీ పీఎస్‌ ‘పెండ్యాల’ సస్పెన్షన్‌

1 Oct, 2023 04:30 IST|Sakshi

ప్రభుత్వానికి చెప్పకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాసరావు

ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ 

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్కిల్‌ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. అయితే, ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయారు.

ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్విసు రూల్స్‌ను అతిక్రమించడమేనని సర్కారు స్పష్టంచేసింది. మరోవైపు.. శ్రీనివాసరావు  శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ప్రభుత్వం నోటీసు పంపింది. అయితే, ఆయన రాకపోవడంతో సర్విసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శ్రీనివాసరావుపై సస్పెన్షన్‌ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు కొనసాగుతుందని ప్రభు­త్వం అందులో స్పష్టంచేసింది. ఈ కాలంలో రాష్ట్ర హెడ్‌ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని పేర్కొంది. సస్పెన్షన్‌ సమయంలో శ్రీనివాసరావుకు నిబంధనల మేరకు అలవెన్స్‌ను చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.  

పెండ్యాల పారిపోయింది ఇలా.. 
అమెరికాలో తన తోడల్లుడి గృహప్రవేశంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉండటంతో సెలవు కోరుతూ ఆగస్టు 23న ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు.  
 స్కిల్‌ కుంభకోణంలో విచారించడానికి సీఐడీ ఆయనకు నోటీసులిచ్చినట్లు సెపె్టంబర్‌ 5, 6 తేదీల్లో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి.  
   దీంతో అత్యవసర ఆరోగ్య పరీక్షల కోసం తక్షణం అమెరికా వెళ్లాలంటూ సెపె్టంబర్‌ 5న మరో లేఖ రాశారు. కానీ, ఈ లేఖతో ఆరోగ్యానికి సంబంధించి కానీ, డాక్టరు సిఫార్సు లేఖ కానీ జతచేయలేదు. 
   సెపె్టంబర్‌ 6న ప్రభుత్వ సర్విసు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండానే అమెరికా వెళ్లిపోయారు. 
   అనంతరం.. ఆరోగ్యం బాగోలేదు దానితో వెంటనే అమెరికా వెళ్లిపోయాను, లీవ్‌ ఇవ్వమని కోరుతూ సెపె్టంబర్‌ 7న లేఖ రాశారు. సాధారణంగా ఇటువంటి సెలవులకు కనీసం 10 రోజుల ముందుగా లేఖ రాయాల్సి ఉంటుంది. 
 ఇక ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారని నిర్థారించుకున్న తర్వాత సెపె్టంబర్‌ 13న సెలవును తిరస్కరించారు. 
 తక్షణం విధుల్లో చేరాల్సిందిగా మెమో జారీచేయగా సెపె్టంబర్‌ 20న సెలవు కోరుతూ మరో లేఖ రాశారు. 
 ఆ తర్వాత మరో మూడ్రోజుల అదనపు సమయం ఇచ్చినా విధుల్లో చేరకపోయేసరికి ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు