బాబుపై టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ ఆగ్రహం

12 Jan, 2021 04:24 IST|Sakshi
విశాఖలో క్రైస్తవుల నిరసన

భవిష్యత్‌ కార్యాచరణపై నేడు సమావేశం  

రాష్ట్రంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు 

సాక్షి, అమరావతి: క్రిస్టియన్లపై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పలు క్రిస్టియన్‌ సంఘాలతో పాటు..ఆ పార్టీ క్రిస్టియన్‌ సెల్‌ సైతం ఆగ్రహంతో రగిలిపోతోంది. రాజకీయాల కోసం ఉన్నట్టుండి యూటర్న్‌ తీసుకుని క్రిస్టియన్లను అవమానిస్తూ మాట్లాడడం, వారిపై నిందలు వేయడం ఏమిటని పలువురు టీడీపీ క్రిస్టియన్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే టీడీపీ క్రిస్టియన్‌ విభాగం పయనించడానికి సిద్ధపడుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ మంగళవారం విజయవాడలో సమావేశం అవుతోంది. రాష్ట్ర నాయకత్వంతోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. చంద్రబాబు తీరును ఎండగట్టాలని, మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది.  

చంద్రబాబు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి 
కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు తమ మతంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ  క్రిస్టియన్‌ లీడర్స్‌ ఫోరం, విశాఖ చాప్టర్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ అద్దేపల్లి రవిబాబు అన్నారు.  చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలోని (జీవీఎంసీ) గాంధీ విగ్రహం వద్ద  క్రైస్తవులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫోరం రాష్ట్ర చైర్మన్‌ ఆలివర్‌ రాయ్, రెవ.డా.డీజే విల్సన్‌బాబు, రెవ.ఎల్‌.ఆర్‌. బిల్లి గ్రహమ్, రెవ.సన్నీజామ్స్, ఎం.జి.డబ్ల్యూ డేవిడ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న పెరికె వరప్రసాదరావు, బందెల దయానందం తదితరులు  

బాబును రాష్ట్రంలోకి రానివ్వం 
మత సామరస్యం కలిగిన రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబును రాష్ట్రంలో కాలుపెట్టనివ్వబోమని క్రిస్టియన్‌ సంఘాలు మండిపడ్డాయి. విజయవాడలో సోమవారం ఏపీ పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్‌ దళిత క్రిస్టియన్‌ రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మాట్లాడారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ కన్వీనర్‌ రెవరెండ్‌ దయానందం, అధ్యక్షుడు రవికిరణ్‌ తదితరులు మాట్లాడారు. 

త్వరలోనే చంద్రబాబు ఏకాకి..  
భవిష్యత్తులో చంద్రబాబు ఏపీలో ఏకాకిలా మారనున్నారని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు లింగం జాన్‌బెన్నీ పేర్కొన్నారు. చంద్రబాబు ఓ మతోన్మాదిలా మారిపోయారని గుడ్లవల్లేరు మండలంలోని శేరీదగ్గుమిల్లిలో పాస్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఏపీ కార్యదర్శి ముత్యాల జయరాజు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు