చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు

8 Nov, 2023 04:08 IST|Sakshi

మధ్యంతర బెయిల్‌ ఉద్దేశం నెరవేరే వరకు ముందుకెళ్లం

సీఐడీ తరఫున హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్‌

సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు, క్విడ్‌ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడంతో పాటు క్విడ్‌ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే.

ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్‌ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్‌ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు.

మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ
ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు.

తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు