ఇది ఆరంభం మాత్రమే 

17 Oct, 2022 03:36 IST|Sakshi
మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్, జేఏసీ సభ్యులు

విశాఖ గర్జనకు హాజరైన వారందరికీ కృతజ్ఞతలు 

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాం 

మా మంచితనాన్ని అమాయకత్వంగా భావిస్తే పొరపాటే 

ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్‌ 

సాక్షి, విశాఖపట్నం:  మూడు రాజధానుల  ఉద్యమం అంతం కాదని.. ఆరంభం మాత్రమే అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్‌ అన్నారు. విశాఖ గర్జన విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యమకారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై జేఏసీ కమిటీతో చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్‌ హోటల్లో ఉత్తరాంధ్ర నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశాఖ గర్జన’ విజయోత్సవ సభలో మాట్లాడారు.

‘అమరావతి ప్రజలంటే మాకు కోపం లేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బావుండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు.. ఏనాడూ మాకు రాజధాని కావాలని డిమాండ్‌ చేయలేదు. అన్నింటికీ తల ఊపుతూనే వచ్చాం. ఇకపై కూడా అన్యాయం జరుగుతుంటే అలానే తల ఊపుతూ కూర్చోలేం. మా మంచితనాన్ని అమాయకత్వమనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు. 

వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలి 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని, విశాఖను పరిపాలన రాజధాని చేసి పేదరికంలో ఉన్న తమ బతుకులు మారుస్తామంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణం అని టీడీపీ, జనసేన వైఖరిపై అజపతిరాయ్‌ మండిపడ్డారు. అమరావతి–అరసవల్లి యాత్ర ద్వారా మా ప్రాంతంలో మా దేవుని దగ్గరకి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దని మా నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు ప్రొఫెసర్‌ విజయకుమార్, కొల్లూరి సూర్యనారాయణ, పాల్, బాల మోహన్‌దాస్, షరన్‌ రాజ్, ఎస్‌ఎస్‌ శివశంకర్, డాక్టర్‌ పి.రామారావు, పైలా కృష్ణమోహన్, దువ్వాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు