మహా నగరంలో మాయగాడు.. సివిల్‌ సప్లయీస్‌ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..

26 Nov, 2022 09:05 IST|Sakshi
రాజేంద్ర తయారుచేసిన నకిలీ ఐడీ కార్డు

ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ వసూళ్ల పర్వం 

ఐ ఫోన్‌లు, ఖరీదైన గృహోపకరణాలు సమర్పించిన బాధితులు 

గన్నవరం పోలీసులకు చిక్కిన ఘరానా మోసగాడు 

విజయవాడలోనూ వెలుగులోకి వస్తున్న బాధితులు

సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్‌/చిట్టినగర్‌: విజయవాడ వన్‌టౌన్‌ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్‌ సప్లయీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్‌ సప్లయీస్‌లోనే డెప్యూటీ కలెక్టర్‌గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. 

మాయమాటలతో బురిడీ 
పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్‌ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్‌ కొనిపించుకుంటాడు.

ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్‌ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. 

చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు)

ఎలా పట్టుబడ్డాడంటే.. 
గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్‌ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్‌తో పాటు స్టోర్‌ మెయింటినెన్స్‌ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని అరవింద్‌కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్‌ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు.

అనంతరం పలు దఫాలుగా అరవింద్‌ నుంచి డిపాజిట్లు, అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్‌తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అరవింద్‌కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్‌ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు.

ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్‌చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14   మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు