సరుకు రవాణా ఇక రయ్ రయ్

25 Feb, 2024 04:33 IST|Sakshi

రాష్ట్రం మీదుగా రెండు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు 

విజయవాడ–ఇటార్సీ కారిడార్‌కు తాజాగా ప్రతిపాదన 

డీపీఆర్‌ రూపొందించాలని ఆదేశించిన రైల్వే శాఖ 

పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రైల్వే కారిడార్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్‌–ఇటార్సీ ఫ్రైట్‌ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది.

ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్‌) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్‌ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది.  

రూ.44 వేల కోట్లతో ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌ 
తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్‌ కోస్ట్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్‌  వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్‌ కారిడార్‌ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్‌పూర్, ధమ్రా, పారాదీప్‌ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు.  విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని  కాళీనగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్‌ దోహదపడుతుంది. ఈ కారిడార్‌ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 

975 కి.మీ. సౌత్‌వెస్ట్‌ కారిడార్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్‌ వెస్ట్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్‌ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్‌) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్‌ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్‌ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్‌ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్‌ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు