విశాఖకు ఉజ్వల భవిష్యత్‌ 

21 Nov, 2023 05:21 IST|Sakshi

సమ్మిళిత ఆర్థిక విధానాలు, మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టుల ద్వారా మరిన్ని ప్రయోజనాలు 

గ్రోత్‌ హబ్‌ ప్రాంతీయ సదస్సులో నీతి ఆయోగ్‌ ప్రత్యేక కార్యదర్శి అనారాయ్‌  

దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో విశాఖ ఒకటని, అన్నిరకాల వనరులూ కేంద్రీ­కృతమైన ఈ నగరానికి ఉజ్వ­ల భవిష్యత్‌ ఉందని నీతి ఆయోగ్‌ ప్రత్యేక కార్యదర్శి అనారాయ్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ ప్రాంతీయ సమావేశాన్ని సోమవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి గిరిజా శంకర్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖలో ఉన్న అభివృద్ధి అవకాశాలు, సువిశాలమైన సముద్ర తీరం, పర్యాటక ప్రాజెక్టులపై కలెక్టర్‌ మల్లికార్జున పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

అనారాయ్‌ మాట్లాడుతూ.. సమ్మిళిత ఆర్థిక విధానాలు, మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టుల అమలు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు పుష్కలమైన అవకాశాలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీచ్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేలా, వారు ఇక్కడ ఎక్కువ రోజులు బస చేసేలా వినూత్న రీతిలో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని చెప్పారు.  

2047 నాటికి గ్రోత్‌ హబ్‌లుగా 20 నగరాలు 
2030, 2047 ఆర్థిక సంవత్సరాల నాటికి దేశంలో 20 నగరాలను గ్రోత్‌ హబ్‌లుగా గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనారాయ్‌ తెలిపారు. ముందుగా దేశంలో నాలుగు గ్రోత్‌ హబ్‌లు గుర్తించామని వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ముంబై, సూరత్, వారణాసితోపాటు విశాఖ నగరాన్ని కూడా గ్రోత్‌ హబ్‌గా ఎంపిక చేశామని చెప్పారు. విశాఖ వంటి మహానగరాలు దేశ అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయన్నారు. విశాఖ జిల్లాకు అనుబంధంగా ఉన్న కోస్తా ప్రాంతంలోని మిగిలిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

రాష్ట్ర ప్రణాళికా విభాగం సెక్రటరీ గిరిజా శంకర్‌ కోస్తా జిల్లాల్లో అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు, చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వివరించారు. కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నీతి ఆయోగ్‌ నేషనల్‌ అడ్వైజర్‌ పార్థసారథిరెడ్డి, మికెన్సీ సంస్థ ప్రతినిధి అఖిలేశ్‌ బాబెల్, విజయనగరం, అనకాపల్లి కలెక్టర్లు ఎస్‌.నాగలక్ష్మి, రవి పట్టన్‌శెట్టి, జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు