మిలన్‌... యుద్ధ నౌకల సమాహారం

25 Feb, 2022 04:41 IST|Sakshi

విశాఖ వేదికగా నేటి నుంచి ప్రారంభం

ఈ ఏడాది ‘స్నేహం–సమన్వయం–సహకారం’ థీమ్‌

39 దేశాల నౌకాదళాలతో రికార్డు స్థాయిలో విన్యాసాలు

ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు హార్బర్‌ ఫేజ్‌

27న సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌

మార్చి 1 నుంచి 4 వరకూ సముద్రంలో విన్యాసాలు

5 వేల మంది భద్రతా సిబ్బంది పహారాలో నగరం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మహానగరం మరో అంతర్జాతీయ విన్యాసాలకు సిద్ధమైంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఈ నెల 21న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూని ఘనంగా నిర్వహించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రతిష్టాత్మకమైన మిలన్‌–2022 అంతర్జాతీయ విన్యాసాలకు ముస్తాబైంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలన్‌ కోసం ఇండియన్‌ నేవీ 46 దేశాలను ఆహ్వానించగా, 39 దేశాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 27న బీచ్‌రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

11వ మిలన్‌కు విశాఖ ఆతిథ్యం 
రెండేళ్లకోసారి నిర్వహించే మిలన్‌ విన్యాసాలు 1995లో ప్రారంభమయ్యాయి. తొలిసారి విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ మాత్రమే పాల్గొన్నాయి. 2005లో సునామీ కారణంగా మిలన్‌ను రద్దు చేశారు. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ కారణంగా మిలన్‌ విన్యాసాలు జరగలేదు. 2010 వరకు 8 దేశాలు పాల్గొన్నాయి. 2012లో ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014, 2018లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పటి వరకూ 10 సార్లు మిలన్‌ విన్యాసాలు జరిగాయి. 11వ మిలన్‌కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. మిలన్‌ను మినీ ఐఎఫ్‌ఆర్‌గా పిలుస్తారు. కానీ.. ఈసారి జరిగే మిలన్‌ – 2022లో ఐఎఫ్‌ఆర్‌కు దీటుగా 39 దేశాలు పాల్గొనడం విశేషం. 

రెండు దశల్లో విన్యాసాలు 
మిలన్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 దేశాలకు చెందిన అధికారులు, యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. శుక్రవారం మిగిలిన దేశాల ప్రతినిధులు హాజరవుతారని నౌకా దళాధికారులు వెల్లడించారు. ఈ విన్యాసాలు రెండు దశల్లో జరుగుతాయి. 25 నుంచి 28 వరకు హార్బర్‌ ఫేజ్‌లో, మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకూ సీఫేజ్‌ విన్యాసాలు నిర్వహిస్తారు. 26వ తేదీన మిలన్‌ విలేజ్‌ ప్రారంభిస్తారు. 27న బీచ్‌ రోడ్డులో ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్రీడా పోటీలు, విదేశీ సందర్శకుల కోసం ఆగ్రా, బోధ్‌గయకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 28న సముద్ర జలాల వినియోగం, భద్రతలో సామూహిక సహకారం అనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తారు. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు జరుగుతాయి. 

సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా.. 
మిలన్‌లో కీలకమైనది 27న జరిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాల నౌకాదళ అధికారులు సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్‌ని తిలకించేందుకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మిలన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, సీనియర్‌ బ్యూరోక్రాట్లు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ఉన్నతాధికారులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు.  ఇతర జిల్లాల నుంచి సివిల్‌ పోలీస్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్పెషల్‌ పోలీస్‌ను రప్పిస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ వంటి తీవ్రవాద నిరోధక దళాలతో పాటు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్, మార్కోస్‌ వంటి కేంద్ర భద్రతా దళాలతో కూడిన సుమారు 3,500 మందిని నగరంలో మోహరించనున్నారు. 

అణువణువూ అండర్‌ కంట్రోల్‌! 
సిటీ పరేడ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అణువణువూ పోలీసుల పర్యవేక్షణలో ఉండనుంది. విన్యాసాలు తిలకించేందుకు అతిథుల కోసం 10 ఎన్‌క్లోజర్లు, సాధారణ ప్రజలు వీక్షించేందుకు 32 ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు.  బీచ్‌ రోడ్డులోని ఈవెంట్‌ ప్రాంతంలోకి ప్రజలను అనుమతించడానికి దాదాపు 16 మార్గాలు ఖరారు చేశారు. ప్రజలు విన్యాసాల్ని స్పష్టంగా తిలకించేందుకు బీచ్‌ రోడ్‌లో, ఎన్‌క్లోజర్ల వద్ద భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.  వీవీఐపీ మార్గంలో, బీచ్‌ రోడ్‌లో 400 సీసీ కెమెరాలు అమర్చనున్నారు. 18 క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లు శాంతి భద్రతల్ని పర్యవేక్షించనున్నాయి. వీరితో పాటు 400కి పైగా అత్యంత శక్తివంతమైన బాంబు నిర్వీర్య బృందాలు, 25 స్నిఫర్‌ డాగ్‌లతో 450 మంది సాయుధ పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించనున్నారు.

మిలన్‌ అంటే..  
హిందీలో సమావేశం అని అర్థం. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలన్‌ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ ఏడాది ‘స్నేహం–సమన్వయం–సహకారం’ థీమ్‌తో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు