కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై

4 May, 2021 04:14 IST|Sakshi
మృతదేహాన్ని మరుభూమికి తరలిస్తున్న వలంటీర్లు

కరోనా సోకిన వ్యక్తి మృతి.. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే మృతదేహం

అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాని వైనం

అన్నీ తామై అంత్యక్రియలు జరిపిన వలంటీర్లు

పిఠాపురం: నలుగురూ ఉన్నా ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించలేని పరిస్థితుల్లో గ్రామ వలంటీర్లే ఆ నలుగురై మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన తలాటం కొండయ్య అనే వ్యక్తి కరోనా బారినపడి సోమవారం మరణించాడు. అతని కుటుంబ సభ్యులు, బంధువులకు సైతం కరోనా సోకడంతో వారెవరూ బయటకురాలేని పరిస్థితి ఏర్పడింది.

ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్లు మోర్త రవి, స్వామిరెడ్డి శివ కామేశ్వరరావు, విజ్జపురెడ్డి నాగేంద్ర, సామాజిక కార్యకర్త స్వామిరెడ్డి బుజ్జి చలించిపోయారు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. మృతదేహాన్ని పంచాయతీకి చెందిన రిక్షాపై మరుభూమికి తరలించి తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

మరిన్ని వార్తలు