Fact Check: చదువులపై ‘చెత్త’ రాతలు

14 Sep, 2023 04:24 IST|Sakshi

విద్యా కార్యక్రమాలపై విషం చిమ్ముతున్న పచ్చ పత్రికలు

బాబు అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం 

ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌పై పిచ్చి రాతలు 

స్కిల్‌ కుంభకోణంలో బాబు ప్రభుత్వం సీమెన్స్‌తో ఒప్పందమే చేసుకోలేదు 

ముందస్తుగానే రూ.వందల కోట్లు చెల్లింపులు 

బైజూస్‌తో పూర్తి పారదర్శకంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒప్పందం 

బైజూస్‌ కంటెంట్‌ పూర్తిగా ఉచితం 

బైజూస్‌కి ప్రభుత్వం ఎటువంటి డబ్బు చెల్లించలేదు 

బహిరంగ, పారదర్శక బిడ్డింగ్‌ ద్వారా శామ్‌సంగ్‌ ట్యాబ్‌ల సేకరణ 

ట్యాబ్‌ల సేకరణలో బైజూస్‌ పాత్ర లేదు 

ట్యాబ్‌లో కంటెంట్‌ లోడ్‌కు బైజూస్‌కు శామ్‌సంగ్‌ ఛార్జీలు చెల్లించింది 

రూ. 2,111.74 కోట్ల విలువైన కంటెంట్‌ను బైజూస్‌ ఉచితంగా అందించింది 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందించడాన్ని పచ్చ పత్రికలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అసత్య కథనాలతో పదే పదే విషం చిమ్ముతున్నాయి. స్కిల్‌ కుంభకోణంలో కోట్లాది రూపాయలు మాయం చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలు కావడంతో దిక్కుతోచని పచ్చ పత్రికలు మరోమారు బడుగుల చదువులపై పడ్డాయి.

చంద్రబాబు దోపిడీ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బుధవారం ఓ పచ్చపత్రిక బైజూస్‌కు లేని టెండర్‌ సీమెన్స్‌కు కావాలా? అంటూ అర్థంపర్థం లేని వార్తను ప్రచురించించి. ఇది పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని, కేవలం ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

చంద్రబాబు ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీమెన్స్‌ సంస్థతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. ముందస్తుగానే వందల కోట్లు చెల్లించేసింది. ఇందులోనే అసలు మతలబు తెలిసిసోతోంది. ఈ వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ కూడా స్పష్టంగా చెప్పింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద పిల్లల అభ్యున్నతికి బైజూస్‌ కంటెంట్‌ అందించడంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించింది. బైజూస్‌తో ఒప్పందం చేసుకొని మరీ ఆ సంస్థ కంటెంట్‌ను పిల్లలకు అందిస్తోంది.

పైగా, బైజూస్‌కు ఎటువంటి చెల్లింపులూ చేయలేదు. వందల కోట్ల విలువైన కంటెంట్‌ను బైజూస్‌ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది. ఎటువంటి ఒప్పందం లేకుండా జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి.., పూర్తి పారదర్శకంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకొని, పూర్తి ఉచితంగా అందిస్తున్న విద్యా సేవకు లింకు పెట్టి పచ్చపత్రిక కథనాన్ని ఇవ్వడాన్ని విద్యా శాఖ ఖండించింది. అసలు వాస్తవాలను విద్యా శాఖ వెల్లడించింది. 

బైజూస్‌ సంస్థతో చేసుకున్న ఎంవోయూ ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో 4 నుంచి 10వ తరగతి పిల్లలకు బైజూస్‌ కంటెంట్‌ యాప్‌ను వారి సొంత మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉచితంగా యాక్సెస్‌ చేయడానికి అందుబాటులో ఉంచారు. 
దీనికోసం బైజూస్‌కి ప్రభుత్వం ఎటువంటి డబ్బు చెల్లించలేదు. 
8వ తరగతి చదివే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు బహిరంగ, పారదర్శక బిడ్డింగ్‌ ద్వారా శామ్‌సంగ్‌ కంపెనీ నుండి ట్యాబ్‌లను  ప్రభుత్వం సేకరించింది.  
దీనిలో బైజూస్‌ పాత్ర ఏమీ లేదు. ఈ శామ్‌సంగ్‌ ట్యాబ్‌ ఎస్డీ కార్డ్‌లో కంటెంట్‌ను లోడ్‌ చేసినందుకు బైజూస్‌కు శామ్‌సంగ్‌ సంస్థే లేబర్‌ ఛార్జీలను చెల్లించింది. 
ఇది బైజూస్, శామ్‌సంగ్‌  హార్డ్‌వేర్‌ తయారీదారుల మధ్య అంతర్గత ఏర్పాటు. కాబట్టి ప్రభుత్వం, బైజూస్‌ మధ్య ఎటువంటి డబ్బుల ఒప్పందం లేదు.  
బడి పిల్లలకు కోర్సుకు రూ. 15,000 చొప్పున 5.18 లక్షల మంది పిల్లలు కంటెంట్‌ని ఉచితంగా యాక్సెస్‌ చేస్తున్నారు. కాబట్టి దీని విలువ దాదాపు 750 కోట్లు ఉచితంగా అందజేసినట్లుగా భావించాలి. 
అంతేకాకుండా 4 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు 17,59,786 మందికి రూ.12,000 విలువ చేసే కంటెంట్‌ విలువ మొత్తం రూ. 2,111.74 కోట్లు అవుతుంది. ఈ మొత్తం కూడా రాష్ట్ర విద్యార్థులకు  ఉచితంగా బైజూస్‌ అందించింది.  

మరిన్ని వార్తలు