2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం

10 Jun, 2021 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీఎం సానుకూలంగా స్పందించారు

2,193 మందికి లబ్ధి

ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి

సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో కామన్‌ మెరిట్‌ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి చెప్పారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని చెప్పారని తెలిపారు. ఆయన బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఈ విషయాన్ని విన్నవించారు.

అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. దీనివల్ల 2,193 మంది నిరుద్యోగ టీచర్లు ఉద్యోగం పొందనున్నారని చెప్పారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో మినహాయించాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి ఈ అక్టోబర్‌ 2వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుందని, ఆ వెంటనే వారందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. రెండేళ్లు నిండగానే శాఖాపరమైన పరీక్షల్లో పాసైన వారందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2008 డీఎస్సీ అభ్యర్థులు పి.వెలుగుజ్యోతి, సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, కార్యదర్శి అంకమరావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి

మరిన్ని వార్తలు