గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ

18 Oct, 2022 04:07 IST|Sakshi

గుండె జబ్బుల బారినపడ్డ పేద, మధ్య తరగతి వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స 

ఏడాదిన్నర కాలంలో 73,856 మందికి చికిత్స 

ఇందుకోసం రూ.378 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాందాస్‌ పేటకు చెందిన ఇతని పేరు బోర రామమూర్తి. పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రామమూర్తి ఒంట్లో నలతగా ఉందని వైద్యుల్ని సంప్రదించగా.. గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో ఏమిటోనని, అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలిచింది.

ఆ పథకం కింద రూ.4.50 లక్షల వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా బైపాస్‌ సర్జరీ చేయించింది. అంతేకాకుండా రామమూర్తి విశ్రాంత సమయంలో పోషణకు ఇబ్బందులు పడకుండా వైఎస్సార్‌ ఆసరా రూపంలో ఆర్థిక సాయం అందింది. ‘ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాన్ని కాపాడింది. నా వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పులు పాలుకాకుండా చూసింది. పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు’ అంటూ రామమూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.  

నిరుపేద, మధ్య తరగతి గుండెలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి ఎన్నో రకాల పెద్ద జబ్బులకు సైతం పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. ఇప్పటికే 2,446 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభిస్తుండగా.. ఆ సంఖ్య త్వరలో 3,254 రకాల చికిత్సలకు పెరగనుంది.

టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు భారీ మేలు చేకూరుతోంది.  పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందుతోంది. వారంతా వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. టీడీపీ హయాంలో పేదలకు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది.  

73,856 గుండెల్లో సంతోషం 
2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ (18 నెలలు) రాష్ట్రంలో 73,856 మంది ఆరోగ్యశ్రీ కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. వీరిలో 21,740 మంది మహిళలు కాగా, 52,116 మంది పురుషులు. వీరి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.378 కోట్లు ఖర్చు చేసింది. 2021–22లో రూ.233 కోట్లు వెచ్చించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్లు వెచ్చించింది. మరోవైపు చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద విశ్రాంత సమయానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. 

ఆరోగ్యశ్రీ కింద బైపాస్‌ సర్జరీ చేశారు 
గుండె జబ్బుతో బాధపడుతున్న నేను కొద్ది రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరాను. బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బైపాస్‌ సర్జరీ చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. కొద్దిరోజులు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు.  
– సి.సుబ్బమ్మ, తిమ్మంపల్లె, అనంతపురం జిల్లా 

జగన్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం 
నేను లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఆగస్టు 15న డ్యూటీ దిగాక గుండెలో నొప్పిగా అనిపించి గుంటూరు నగరంలోనే ఓ ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు అనంతరం బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగించే నాకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. నా చికిత్సకు సాయం చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.  
– బి.శ్రీనివాసరావు, గుంటూరు నగరం

అర్హులందరికీ ఉచితంగా చికిత్స 
అర్హులందరికీ ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత పెద్ద వ్యాధులతోపాటు క్యాన్సర్‌ వంటి జబ్బులకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. త్వరలో మరిన్ని చికిత్సలను తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 చికిత్సలకు వైద్యం అందుతుండగా.. త్వరలో ఆ సంఖ్య 3,254కు పెరగనుంది. 
   – హరేంధిర ప్రసాద్, సీఈవో, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 

మరిన్ని వార్తలు