ఎంతటి వారైనా ఉపేక్షించం: ఆనం హెచ్చరిక

5 Oct, 2020 08:25 IST|Sakshi

బీమా సొమ్ము దుర్వినియోగంపై ఆనం ఆగ్రహం 

విచారణ జరపాలని అధికారులకు ఆదేశం 

బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ

సాక్షి, నెల్లూరు (కలువాయి): గిరిజన కుటుంబానికి దక్కాల్సిన ప్రభుత్వ సహాయంలో ఎవరు అవకతవకలకు పాల్పడి ఉన్నా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. రమణయ్య అనే వ్యక్తి మృతిచెందగా వైఎస్సార్‌ భీమా పథకం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన రూ.2 లక్షలను స్థానిక పెద్దలు, అధికారులు కలిసి దుర్వినియోగం చేశారు. దీనిపై ఆదివారం సాక్షిలో ‘మనుషులా.. రాబంధులా!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆనం స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   (మనుషులా.. రాబంధులా!)

ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఎమ్మెల్యే కలువాయి ఎంపీడీఓ సింగయ్యను ఆదేశించారు. ఆయన స్పందించి వెలుగు అధికారులను గ్రామానికి పంపి విచారణ చేయించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. పొదుపు రుణానికి కట్టేందుకు అని పక్కన పెట్టిన రూ.80 వేలు, అప్పు కింద గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జమ చేసుకున్న రూ.60 వేలు రెండురోజుల్లో వసూలు చేసి రమణయ్య కుమార్తెల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. వారు నగదు తక్షణమే చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.

రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం 
– కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి 

కలువాయి: ‘మనుషులా.. రాబంధులా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున ఆ రమణయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ రెండు, మూడురోజుల్లో రమణయ్య పిల్లల పేరున నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. రమణయ్య కుటుంబానికి జరిగిన అన్యాయ్యాన్ని కలెక్టర్, గూడూరు సబ్‌ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరామన్నారు. వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చి, రమణయ్య చిన్న కుమార్తె స్వాతికి దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేసేలా చర్యలు కలెక్టర్‌ను కోరానన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా