R Krishnaiah Political Profile: గోల్డ్‌ మెడలిస్ట్‌.. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పోరుబాట

17 May, 2022 18:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీసీ సంఘ నేత ఆర్‌ కృష్ణయ్యను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. దశాబ్దాలపాటు బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమనేతకు సముచిత స్థానం ఇవ్వాలనే సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేపథ్యం ఏంటో చూద్దాం.  

ఆర్‌ కృష్ణయ్య..  పూర్తి పేరు ర్యాగ కృష్ణయ్య. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమ నేతగా ఎదిగారు.

నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో  రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్‌.కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్‌ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ కోసం సైతం పోరాటాలు చేశారు.

1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా..  ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.

చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు-ఆర్‌ కృష్ణయ్య 

మరిన్ని వార్తలు