చేనేత పురిలో చైతన్య భేరి

23 Dec, 2023 05:28 IST|Sakshi
సభలో ఐక్యత చాటుతున్న ప్రజాప్రతినిధులు

ఎమ్మిగనూరులో ఘనంగా వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర

తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు

ప్రజలతో కిక్కిరిసిన పుర వీధులు

జై జగన్‌ నినాదాలు, ఈలలు, కేరింతలతో మార్మోగిన సభా ప్రాంగణం

మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజల నినాదాలు

కర్నూలు (రాజ్‌విహార్‌): చేనేత వస్త్రాలకు మారుపేరైన ఎమ్మిగనూరులో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం పట్టణంలో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈ యాత్రలో పాల్గొని, సాధికారతను ప్రదర్శించారు.

మండల పరిషత్‌ కార్యాలయంనుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్సు యాత్ర సాగిన పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అనంతరం బస్టాండు వద్ద వేలాది ప్రజలతో భారీ బహిరంగ సభ జరిగింది. యాత్ర మొదలుకొని సభ ముగిసేవరకు పట్టణం జై జగన్‌ నినాదాలతో మార్మోగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్‌ జగన్‌ సాధికారత దిశగా నడిపించిన తీరును నేతలు వివరిస్తున్నప్పుడు సభా ప్రాంగణం నినాదాలు, ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇది జగనన్న పెంచిన ఆత్మగౌరవం : మంత్రి మేరుగు నాగార్జున
ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం వైఎస్‌ జగన్‌ పెంచిన ఆత్మగౌరవమే కారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతను సీఎం జగన్‌ నిజం చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా దళితులు, బలహీనవర్గాలను ఎన్ని అవమానాలకు గురిచేశారో ఎవరూ మరువలేరని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వర్గాలనే అణిచివేశారని వివరించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తెచ్చారని చెప్పారు. సీఎం జగన్‌ వల్లే నేడు మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ చదువులు చదువుతున్నారని తెలిపారు.  చంద్రబాబు మాటలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కుల మతాలు చూడని నాయకుడు : ఎంపీ గురుమూర్తి
పేదలకు మేలు చయడంలో సీఎం జగన్‌ను మించిన నేత లేరని ఎంపీ గురుమూర్తి చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అని తెలిపారు. నాలుగు­న్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నారని వివరించారు. ఒకప్పుడు నాయకులు చుట్టూ మనం తిరిగే వాళ్లమని, కానీ ప్రభుత్వ సిబ్బంది మన సేవ కోసం ఇంటి వద్దకే వస్తున్నారని తెలిపారు.

అట్టడుగు వర్గాలకు మేలు: ఎంపీ గోరంట్ల మాధవ్‌
రాష్ట్రంలో సీఎం జగన్‌ నేతృత్వంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతోందని, వారంతా అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను పావులా వాడుకుని, అధికారంలోకి వచ్చాక అణచివేశారని తెలిపారు. చంద్రబాబుకు ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నారు. కనీసం బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పవన్‌ రాష్ట్రంలో ఏం చేయగలరని ప్రశ్నించారు. 

బడుగులకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్‌: ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో బడుగులకు గుర్తింపు తెచ్చారని ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నుంచి కేబినెట్, నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి, ఆ వర్గాలను తలెత్తుకునేలా చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఈ వర్గాలన్నీ అవహేళనకు, అణచివేతకు గురయ్యాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న సామాజిక కుట్రకు ఓటుతో సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల పక్షాన ఉన్న సీఎం జగన్‌ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తదితరులు ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు