విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

22 Mar, 2023 02:04 IST|Sakshi

మదనపల్లె : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ చైర్మన్‌ కె.రామమోహన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక, మదనపల్లె ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డివిజన్‌ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ నిర్వహించారు. విద్యుత్‌ వినియోగదారులు పరిష్కారం కాని సమస్యలను రాతపూర్వక ఫిర్యాదుగా అర్జీ రూపంలో తెలిపి పరిష్కరించుకోవాల్సిందిగా అదాలత్‌ సభ్యులు కోరారు. అయితే ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌పై విద్యుత్‌ శాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించడంలో నిర్లక్ష్యవైఖరి కనపరచడంతో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వినియోగదారులు హాజరయ్యారు. దీనికితోడు సమావేశ ఏర్పాట్లు మొక్కుబడిగా చేయడంతో విద్యుత్‌ అదాలత్‌ అధ్యక్షుడు కె.రామమోహన్‌ వినియోగదారుల సమావేశం ఇలాగేనా నిర్వహించేదంటూ.. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.రాజశేఖర్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో భాగంగా వినియోగదారులను సమస్యలపై తెలపాలని కోరితే.. సీటీఎం పంచాయతీ చిన్నాయనచెరువుపల్లెకు చెందిన రైతు బి.లింగేశ్వర మాట్లాడుతూ ఏడేళ్లుగా వ్యవసాయ విద్యుత్‌ వాడుకుంటున్నా బిల్లు కట్టించుకోవడం లేదని, ఎక్కువ బిల్లు వస్తే ఒకే సారి చెల్లించే ఆర్థిక స్తోమత లేదని, కావున బిల్లు కట్టించుకోవాలని కోరారు. పోతబోలుకు చెందిన ఇమాంబేగ్‌ 2013లో అడిషనల్‌ లోడ్‌కు సంబంధించి డీడీ కడితే ఇప్పటి వరకు పెంచడం జరగలేదని ఫిర్యాదు చేశారు. ఆవులపల్లెకు చెందిన కృష్ణమూర్తి 2019లో వ్యవసాయ విద్యుత్‌ సర్వీస్‌ కోసం రూ.10,030 చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు మెటీరియల్‌ ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. దెయ్యాలవారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డి తనకు అగ్రికల్చర్‌ సర్వీస్‌ ఇచ్చి పదేళ్లవుతున్నా ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీఎస్పీడీసీఎల్‌ పని చేయాలన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ సాంకేతిక సభ్యులు యస్‌.యల్‌.అంజనీకుమార్‌, స్వతంత్య్ర సభ్యులు జి.ఈశ్వరమ్మ, ఏపీఎస్పీడీసీఎల్‌ ఏడీ, ఏఈ, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌లో చైర్మన్‌ కె.రామమోహన్‌

>
మరిన్ని వార్తలు