కోదండ రామాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

22 Mar, 2023 23:56 IST|Sakshi
గ్రామోత్సవంలో ఊరేగుతున్న సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులు

ఒంటిమిట్ట : రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మూల మూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, సుగంధ పరిమళమైన తులసీ గజమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వేకువ జామునుంచే భక్తులు స్నానాలు ఆచరించి స్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవ మూర్తులైన సీతారామలక్ష్మణులను దర్శించుకుని, కాయ కర్పూరం సమర్పించారు.

పంచాంగ శ్రవణం

శ్రీ శోభ కృత్‌ నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కృత నామ సంవత్సర పంచాంగాన్ని ఆలయ ఆస్థాన పురోహితులు వివరించారు. అనంతరం సీతారామలక్ష్మణుల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

స్వామివారికి ఉగాది ప్రత్యేక పూజలు

మరిన్ని వార్తలు