సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయల ఎగుమతులు

22 Nov, 2023 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: సముద్ర మార్గంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా నియమావళిని (ప్రొటోకాల్‌) కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. అరటి, మామిడి, దానిమ్మ, జాక్‌ఫ్రూట్‌ తదితర ఉత్పత్తులను ప్రస్తుతం విమాన రవాణా ద్వారా పంపిస్తున్నారు.

ఎగుమతుల పరిమాణం తక్కువగా ఉండడం, పండ్లు పక్వానికి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడమే ఇందుకు కారణం. సముద్ర రవాణా ప్రోటోకాల్‌లో భాగంగా, పండ్లు పరిపక్వానికి వచ్చే నిర్ధిష్ట కాల వ్యవధి, ఒక్కో ఉత్పత్తి శాస్త్రీయంగా ఎన్ని రోజులకు పండుతుంది? నిర్దేశిత సమయంలో వాటిని సాగు చేయడం, రైతులకు శిక్షణ ఇవ్వడం వంటివి భాగంగా ఉంటాయి. ఒక్కో పండు, కూరగాయకు ఇది వేర్వేరుగా ఉంటుంది. సముద్ర మార్గంలో రవాణాతో తక్కువ వ్యయానికి, ఎక్కువ మొత్తంలో పంపించుకోవచ్చని రాజేష్‌ అగర్వాల్‌ తెలిపారు.

‘‘ఇప్పటి వరకు వీటిని వాయు మార్గంలోనే ఎగుమతి చేస్తున్నాం. అగ్రి ఉత్పత్తుల ఎగుమతులకు సముద్ర రవాణాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్నది పరీక్షించి చూస్తున్నాం. అందుకే సముద్ర ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేస్తున్నాం’’అని రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విమానయానం ద్వారా పంపిస్తుండడంతో, ధరల పరంగా పోటీ ఇచ్చే సానుకూలత ఉండడం లేదన్నారు. అపెడా, ఇతర భాగస్వాములతో కలసి అరటి పండ్ల ఎగుమతులకు సంబంధించిన  ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఖాళీ కంటెయినర్‌లో పరీక్షించి చూశాం. ప్రత్యక్ష పరిశీలనలో భాగంగా రోటెర్‌డ్యామ్‌కు మొదటి షిప్పింగ్‌ను  పంపించాం. ఇది విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఒక్కసారి ఇది పూర్తయితే దిగుమతిదారులు ఆమోదించడం మొదలవుతుంది. అప్పుడు పెద్ద మొత్తంలో ఎగుమతులకు వీలు కలుగుతుంది’’అని అగర్వాల్‌ వివరించారు.  

అరటి సాగులో నంబర్‌ 1 
ప్రపంచంలో అరటి తయారీలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. అయినా కానీ, ప్రపంచ అరటి ఎగుమతుల్లో భారత్‌ వాటా కేవలం 1% మించి లేదు. ప్రపంచ అరటి ఉత్పత్తిలో భారత్‌ వాటా 26. 45 శాతంగా ఉంది. ఇది 35.36 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద చేసిన అరటి ఎగుమతులు ఏ మాత్రం మార్పు లేకుండా 176 మిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఆగస్ట్‌ వరకు మామిడి ఎగుమతులు 19% పెరిగి 48 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు మన దేశం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతులు 13% వృద్ధితో 2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు