WEF 2022: సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్‌ వ్యాఖ్యలు

26 May, 2022 12:05 IST|Sakshi

సంపన్న ఎకానమీలు మళ్లీ పట్టాలెక్కడానికి రెండేళ్లు

ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌ విశ్లేషణ

దావోస్‌: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్‌లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... 
♦ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి  ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది.  
♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్‌గ్రేడ్‌ దృక్పధాన్ని కలిగి ఉన్నాము.  
♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్‌ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.  వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది.   
♦  కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్‌ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం.  
♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.   

మరిన్ని వార్తలు