5జీని విస్తరిస్తున్న టెల్కోలు

9 Mar, 2023 05:31 IST|Sakshi

331 ప్రాంతాల్లో జియో సర్వీసులు

265 కేంద్రాల్లో ఎయిర్‌టెల్‌ సేవలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం కంపెనీలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నాయి. రిలయన్స్‌ జియో తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోసహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 నగరాలు, పట్టణాల్లో నూతనంగా 5జీ సర్వీసులను జత చేసింది. దీంతో భారత్‌లో కంపెనీ మొత్తం 331 ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని పరిచయం చేసినట్టు అయింది. జియో వెల్కమ్‌ ఆఫర్‌లో భాగంగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే కస్టమర్లు ప్రస్తుత చార్జీతో 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో అపరిమిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. 2023 చివరినాటికి దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీ సులను అందుబాటులోకి తేవాలన్నది రిలయన్స్‌ లక్ష్యం. సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  

భారతీ ఎయిర్‌టెల్‌ సైతం..
మరో టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఏకంగా 125 నగరాలు, పట్టణాల్లో కొత్తగా 5జీ సేవలను జోడించింది. దీంతో సంస్థ అందిస్తున్న 5జీ సర్వీసులు దేశంలో మొత్తం 265 ప్రాంతాలకు విస్తరించాయి. ఉత్తరాదిన జమ్మూ మొదలుకుని దక్షిణాదిన కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన నగరంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు 5జీని వేగంగా చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలతోపాటు ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెడతామని భారతీ ఎయిర్‌టెల్‌ సీటీవో రన్‌దీప్‌ సెఖన్‌ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు లక్ష్యమని తెలిపారు.
 

మరిన్ని వార్తలు