ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షా

10 Dec, 2023 15:40 IST|Sakshi

ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈవో, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షికోత్సవంలో ప్రస్తుత అధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా నుంచి 2023-2024 సంవత్సరానికి గానూ అనిష్‌ షా బాధ్యతలు చేపట్టారు.

ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్‌గా ఉన్న అనిష్‌ షా యూకే  ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉ‍న్నారు. దీంతోపాటు ఆటోమోటివ్ గవర్నర్స్ కౌన్సిల్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) అధ్యక్షుడిగా, ఇండియా అలయన్స్ ఆఫ్ సీఈవోస్ ఫర్ క్లైమేట్ చేంజ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్), ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో కౌన్సిల్‌లకు అనిష్‌ షా సహ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫిక్కీ ప్రకటనలో పేర్కొంది.

మహీంద్రా గ్రూప్‌ కంటే ముందు అనిష్‌ షా 2009-14 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్‌, సీఈవోగా పనిచేశారు. ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన జీఈ క్యాపిటల్ యూఎస్‌, గ్లోబల్ యూనిట్లలో అనేక నాయకత్వ  స్థానాలను నిర్వహించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్‌ డెబిట్ ఉత్పత్తుల వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇక బోస్టన్, ముంబైలోని సిటీ బ్యాంక్‌లో బైన్ అండ్‌ కంపెనీతో కలిసి పనిచేశారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అనిష్‌ షా.. కార్నెగీ మెల్లన్స్‌ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

>
మరిన్ని వార్తలు