యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ

25 May, 2022 16:57 IST|Sakshi

దావోస్‌లో సీఎం జగన్‌ వరుస సమావేశాలు

స్టార్టప్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో సీఎం జగన్‌ భేటీ

స్టార్టప్‌లకు అవసరమైన వనరులు సమకూరుస్తామన్న సీఎం జగన్‌

దావోస్‌: యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వివిధ స్టార్టప్స్‌కు చెందిన వ్యవస్థాపకులు, సీఓలు, వీటికి సంబంధించిన ముఖ్య అధికారులతో దావోస్‌లో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటు, వాటి అభివృద్ధిపై చర్చించారు.

విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం జగన్‌ తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు మీ అందరికీ ఏపీ ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారితో సీఎం చర్చించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. 

విద్యారంగం
ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ సుష్మిత్‌ సర్కార్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా బైజూస్‌ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. 

భూ సర్వే
ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డులు భద్రపరచడం.. ఈ అంశాలతో ముడిపడిన సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాలపై కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ సింఘాల్‌తో సీఎం జగన్‌ చర్చించారు. అనంతరం సింఘాల్‌ మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంతో ఏపీ సర్కారుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 

టూరిజం
ఈజ్‌ మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టితో సీఎం సమావేశమయ్యారు. ఇందులో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రశాంత్‌ పిట్టి మట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామన్నారు. అంతేకాదు ఏపీలోని పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపు తీసుకువస్తామని వెల్లడించారు.  
 


మరింత మంది
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్‌ ఆత్రేయ,  వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు. 

చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు

మరిన్ని వార్తలు