అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!

14 Sep, 2023 21:46 IST|Sakshi

విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం.

స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్‌ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్‌ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. 

"జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

బర్త్ సర్టిఫికెట్‌ ఉంటే చాలు..
జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు.

(వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..)

ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు