Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి

15 Sep, 2023 00:12 IST|Sakshi
విత్య, నిత్య

న్యూస్‌మేకర్‌

‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్‌. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్‌ హాస్టల్‌లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్‌ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది.

అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్‌ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన.

ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి.

స్కూల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ద్వారా స్పోర్ట్స్‌ స్కూల్‌ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్‌ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు.

ఆసియా గేమ్స్‌ ఆశాకిరణాలు
మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్‌ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్‌ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్‌ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్‌ రన్‌లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు ఆసియా గేమ్స్‌ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య.

పి.టి. ఉషతో సమానంగా
విత్య రామరాజ్‌ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్‌ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య.
ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి.

మరిన్ని వార్తలు