ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్‌లో నిపుణుల అంచనాలు!

1 Sep, 2023 19:28 IST|Sakshi

దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్‌ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్‌లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది.

ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్‌ నెలలో నిర్వహించిన పోల్‌లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం
అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్‌ కూడా హౌసింగ్‌ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్‌లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు.

పెరగనున్న ఇంటి అద్దెలు
ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్‌లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు.

మరిన్ని వార్తలు