ఎగుమతులకు కేంద్రం బూస్ట్‌

30 Sep, 2021 03:40 IST|Sakshi

ఈసీజీసీ లిస్టింగ్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర

2022–23లో మార్కెట్‌లోకి ఆఫర్‌

వచ్చే ఐదేళ్లలో రూ.4,400 కోట్ల మూలధన కల్పన

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎగుమతుల రుణ హామీ బీమా సేవల సంస్థ– ఈసీజీసీ లిస్టింగ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఐదేళ్లలో (2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–2026 ఆర్థిక సంవత్సరం వరకూ)మూలధనంగా కంపెనీకి రూ.4,400 కోట్లు సమకూర్చడానికి కూడా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థ మరింత మంది ఎగుమతిదారులకు రుణ హామీ బీమా సేవలను అందజేయగలుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు.  ఎగుమతుల రంగం పురోగతికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని ఆయన వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుందని, ఇందులో సెప్టెంబర్‌ ముగింపునకు 190 బిలియన్‌ డాలర్లకు చేరువవుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎగుమతుల పురోగతికి ఈసీజీసీ తమ సామర్థ్యాన్ని మరింత పటిష్ట చేసుకోడానికి దోహదపడుతుందని వివరించారు. తక్షణం ఈసీజీసీకి రూ.500 కోట్లు మూలధనంగా సమకూర్చుతున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.500 కోట్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈసీజీసీ లిస్టింగ్‌ ప్రక్రియను కేంద్రం త్వరలో ప్రారంభిస్తుందని, వచ్చే ఏడాది ఆఫర్‌ మార్కెట్‌లోకి వస్తుందని వెల్లడించారు.  

ఎన్‌ఈఐఏ స్కీమ్‌ కొనసాగింపు
నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ) స్కీమ్‌ కొనసాగింపునకు, అలాగే వచ్చే ఐదేళ్లలో రూ.1,650 కోట్ల మేర గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అందించడానికి కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు.ఈ చర్య ద్వారా సంఘటిత రంగంలో దాదాపు 12,000సహా మొత్తం 2.6 లక్షల నూతన ఉద్యోగ కల్పన జరుగుతుందని మంత్రి వివరించారు.

2022 మార్చి వరకు ఈసీఎల్‌జీఎస్‌ స్కీమ్‌
చిన్న సంస్థలకు మరింత చేయూత కోసమే
కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌లతో ఆర్థికంగా దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకునేందుకు అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) మరింత కాలం పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయంచింది. 2020లో తీసుకొచి్చన ఈ పథకం గడువు వాస్తవానికి 2021 సెపె్టంబర్‌ 30తో ముగిసిపోవాలి. కానీ, 2020 మార్చి 31 వరకు అంటే మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల మండళ్లు, ఇతర భాగస్వాముల నుంచి డిమాండ్‌లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ‘‘కరోనా రెండో విడత వల్ల ప్రభావితమైన పలు వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు 2020 మార్చి 31 వరకు ఈసీఎల్‌జీఎస్‌ పథకం గడువును పొడిగించాలని నిర్ణయించడమైనది.

లేదా రూ.4.5 లక్షల కోట్ల రుణాల మంజూరు లక్ష్యం పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది’’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. ఈ పథకం కింద రుణాల విడుదలకు చివరి తేదీగా 2020 జూన్‌ 30 అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈసీఎల్‌జీఎస్‌ 1.0, 2.0 కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు.. అదనంగా మరో 10% (మిగిలిన రుణంలో) లభిస్తుందని పేర్కొంది. ఈసీఎల్‌జీఎస్‌ 1.0, 2.0 కింద ఇప్పటి వరకు సాయం పొందని సంస్థలు.. 30 శాతాన్ని (తమ రుణ బకాయిల మొత్తంలో) తాజా రుణం కింద తీసుకోవచ్చని సూచించింది. ఈసీఎల్‌జీఎస్‌ 3.0 కింద ప్రకటించిన రంగా ల్లోని కంపెనీలకు ఇది 40%గా అమలు కానుంది.  

మరిన్ని వార్తలు