ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్‌ రూపంలో రూ.17 వేల కోట్లు

10 Nov, 2023 07:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్‌ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్‌ నెల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్‌ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి.

  • స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు.
  • థీమ్యాటిక్‌ ఫండ్స్‌ రూ. 3,896 కోట్ల  పెట్టుబడులను ఆకర్షించాయి.  
  • వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్‌ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి.
  • డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్‌ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం.  
  • డెట్‌లో లిక్విడ్‌ ఫండ్స్‌ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్‌ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి.
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి.
  • అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి.
  • మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్‌ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. 
మరిన్ని వార్తలు