Advice to Job seekers: ఇలా చేస్తే జాబ్‌ పక్కా! ఐఐటీయన్‌, స్టార్టప్‌ ఫౌండర్‌ సూచన..

18 Jul, 2023 16:03 IST|Sakshi

ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్‌. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్‌ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్‌ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్‌ సరిపోదంటున్నారు ఐఐటీయన్‌, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. 

విభిన్నమైన జాబ్‌లకు విభిన్న రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్‌మెంట్‌ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్‌లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్‌బుక్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. 

ఇదీ చదవండి  లేఆఫ్స్‌ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? 

ఐఐటీలో ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్‌లకు విభిన్న వెర్షన్‌ల రెజ్యూమ్‌లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్‌లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్‌ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌ గురించి, అదే డెవలప్‌మెంట్‌కు సంబంధించిన జాబ్‌ల కోసమైతే మీ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్‌ల గురించి రెజ్యూమ్‌లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. 

విభిన్న రెజ్యూమ్‌లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్‌కుమార్‌ అన్నారు. కాగా సౌరభ్‌కుమార్‌ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు.

మరిన్ని వార్తలు