రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్‌ అరెస్ట్‌

28 Oct, 2023 20:40 IST|Sakshi

పారాబొలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు ప్రణవ్‌ గుప్తా, వినీత్‌ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్‌ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

మనీలాండరింగ్‌ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్‌ గుప్తా, వినీత్‌ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. వీరితోపాటు చార్టెట్‌ అకౌంటెంట్‌ ఎస్‌కే బన్సాల్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్‌ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది.

కాగా పారాబోలిక్‌ డ్రగ్స్‌ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్‌ గుప్తా, వినీత్‌ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్‌ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్‌, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్‌ డ్రగ్స్‌ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్‌ ఉన్నారని, వారిలో వినీత్‌, ప్రణవ్‌ గుప్తా ఒకరని తెలిపారు.
చదవండి: అవును.. పార్ల‌మెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మ‌హువా మొయిత్రా

మరిన్ని వార్తలు